Haryana Clashes: 



రాళ్ల దాడి 


హరియాణా అల్లర్లలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు ఓ మహిళా జడ్జ్. నూహ్‌లో కార్‌లో వెళ్తుండగా ఆందోళనకారులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ సమయంలో జడ్జ్‌తో పాటు ఆమె మూడేళ్ల కూతురు కూడా కార్‌లోనే ఉంది. దాడి చేయడమే కాదు. పెట్రోల్ పోసి నిప్పంటించారు. రెప్పపాటులో కార్‌లో నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు జడ్జ్. కూతురికీ ప్రాణాపాయం తప్పింది. అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్న అంజలి జైన్, తన మూడేళ్ల కూతురితో కలిసి కార్‌లో బయటకు వచ్చారు. కొంత దూరం వరకూ బాగానే ఉన్నా...ఉన్నట్టుండి కార్‌పై రాళ్ల దాడి మొదలైంది. కాల్పులూ జరిపారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అంజలి జైన్ తన కూతురుని తీసుకుని కార్‌లో నుంచి బయట పడ్డారు. పక్కనే ఉన్న ఓ పాత బస్‌స్టాండ్‌లో తలదాచుకున్నారు. తరవాత కొంత మంది న్యాయవాదులు వచ్చి ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్లారు. మందులు కొనుక్కుని వస్తూ ఉండగా ఒకేసారి 100-150 మంది దాడికి పాల్పడ్డారని వివరించారు అంజలి జైన్. ఈ దాడిపై పోలీసులు FIR నమోదు చేశారు. 


"ఆందోళనకారులు జడ్జ్ కార్‌పై రాళ్ల దాడి చేశారు. కొన్ని రాళ్లు కార్‌ వెనక నుంచి దూసుకొచ్చాయి. అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఆ తరవాత కాల్పులు జరిపారు. వెంటనే కార్‌లో నుంచి దిగి బాధితులు వెళ్లిపోయారు. ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్నారు. ఓ వర్క్‌షాప్‌లో దాక్కున్నారు. కాసేపటి తరవాత తోటి న్యాయవాదులు వచ్చి రక్షించారు. ఈ దాడిలో కారు పూర్తిగా కాలిపోయింది"


- పోలీసులు 


అటు ఢిల్లీలోనూ ఈ అల్లర్లపై ఆందోళనలు జరుగుతున్నాయి. బజ్‌రంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు ఢిల్లీ, NCR ప్రాంతాల్లో ర్యాలీలకు పిలుపునిచ్చారు. వీటికి అనుమతినిస్తే మరింత హింస చెలరేగే ప్రమాదముందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఆ ర్యాలీలను అడ్డుకోవడాన్ని వ్యతిరేకించింది. ఇదే సమయంలో విద్వేష పూరిత ప్రసంగాలు చేయకుండా పోలీసులు జాగ్రత్త పడాలని హెచ్చరించింది. గుడ్‌గావ్‌, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రత పెంచారు. ముస్లింలు ఇంతగా దాడులు చేయడానికి కారణం...విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన యాత్ర. ఆ యాత్రను లీడ్ చేసిన మోను మనేసర్...గతంలో ఇద్దరు ముస్లింలను హత్య చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇదే వ్యక్తి అక్కడ బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర నిర్వహించాడు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ముస్లింలు దాడులు చేశారు. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం...వేలాది మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. దాదాపు 2,500 మంది ఆందోళనకారులు ఆలయంపై దాడి చేశారు. అక్కడి షాప్‌లను ధ్వంసం చేశారు.