Harsh Goenka Post On ISRO Chairman Salary: ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గోయెంకా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతి తక్కువ మంది ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఆయన కూడా ఒకరు. సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులతో ఆలోచనలు రేకెత్తిస్తారు. వినోదభరితంగా సందేశాలు అందిస్తారు. ప్రేరణాత్మక, ఆసక్తికరమైన పోస్టులు చేస్తుంటారు. ఆయన చమత్కారమైన, హాస్యభరితమైన ట్వీట్లు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ ప్రముఖ వ్యాపారవేత్త మరో ట్వీట్ ద్వారా చర్చను లేవనెత్తారు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ జీతం గురించి ఆయన తాజాగా ట్వీట్ చేశారు.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టడం ద్వారా చంద్రయాన్-3 మిషన్ తో ఇస్రో చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత సూర్యుడిపై పరిశోధనలు జరపడానికి ఆదిత్య-ఎల్1 ను ప్రయోగించింది. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతూ.. ప్రేరణగా నిలుస్తున్న ఇస్రోకు చీఫ్ పదవిలో ఉన్న ఎస్. సోమనాథ్ నెలవారీ జీతం గురించి హర్ష గోయెంకా ట్వీట్ చేశారు. సోమనాథ్ నెలకు రూ. 2.5 లక్షలు సంపాదిస్తున్నారని గోయెంకా తన పోస్టులో వెల్లడించారు. ఇది సరైన నెలవారీ ఆదాయమేనా అని నెటిజన్లను ప్రశ్నించారు. సైన్స్ పై, పరిశోధనలపై, దేశంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు ఉన్న అభిరుచి గురించి కూడా చెప్పుకొచ్చారు.
'ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ జీతం నెలకు రూ.2.5 లక్షలు. ఇది సరైనదేనా, న్యాయమేనా? ఆయనలాంటి వ్యక్తులు డబ్బుకు మించిన కారణాలతో ప్రేరణ పొందుతారు. వారికి సైన్స్, పరిశోధనలపై ఉన్న అభిరుచి, అంకితభావంతో దేశాన్ని గర్వపడేలా చేస్తారు. ఆయనలాంటి అంకితభావం గల వ్యక్తులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను' అని హర్ష గోయెంకా తన ట్వీట్ లో రాసుకొచ్చారు.
హర్ష గోయెంకా ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావాన్ని, దేశం పట్ల ప్రేమను కొనియాడుతున్నారు. 'దేశం, పనిపై ఇస్రోలో పని చేసే సోమనాథ్ లాంటి వ్యక్తుల అంకితభావం వెలకట్టలేనిది. అలాంటి వ్యక్తులు జీతం కోసం కాకుండా వారి అభిరుచి కోసం, దేశం కోసం ఏదైనా చేయాలన్న తపనతో ముందుకు సాగుతారు' అని ఓ యూజర్ కామెంట్ చేశారు.
'ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు నెలకు రూ. 25 లక్షల కంటే ఎక్కువే వేతనం ఇవ్వాలి. ఆయన ప్రతిభను గుర్తించి రివార్డ్ ఇవ్వాలి' అని మరొకరు రాసుకొచ్చారు.
'ఇలాంటి వ్యక్తులు తమ అభిరుచి కోసం మాత్రమే పని చేస్తుంటారు. వారికి వేతనాలతో సంబంధం ఉండదు. కానీ రూ. 2.5 లక్షల అనేది బహుశా బేసిక్ పే అయి ఉండొచ్చు. ఇతర ప్రోత్సాహకాలు, అలవెన్సులు కూడా ఉంటాయి. శాస్త్రవేత్తలను తగిన విధంగా చూస్తుంటారు, అలాంటి వాటికి వారు నిజంగా అర్హులే. వారు ప్రైవేట్ రంగంలో ఉంటే చాలా రెట్లు అధికంగా సంపాదించగలరన్నది వాస్తవం. అలాగే వైద్యులు, న్యాయమూర్తులు, పరిశోధకులు, ఇతర రంగాల నిపుణులకు కూడా ఇది వర్తిస్తుంది' అని మరో యూజర్ కామెంట్ చేశారు.