Modi Degree: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కు అహ్మదాబాద్ కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. జూన్ 7 వ తేదీన ఇద్దరు నాయకులు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అకడమిక్ డిగ్రీ (విద్యార్హతల)పై గుజరాత్ వర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై అహ్మదాబాద్ కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ ఇద్దరు నేతలను మంగళవారం కోర్టు ముందు హాజరు కావాలని గతంలో సమన్లు జారీ చేసింది. కానీ వీరు విచారణకు కోర్టుకు రాలేదు. వీరిద్దరికి సమన్లు అందినట్లు కనిపించడం లేదని కోర్టుకు తెలపడంతో మరోసారి సమన్లు జారీ చేసింది. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు కేజ్రీవాల్, సంజయ్ సింగ్ లకు ఈ నోటీసులు ఇచ్చింది. అయితే, కేజ్రీవాల్, సంజయ్ సింగ్ లకు కోర్టు జారీ చేసిన సమన్లు ఇంకా అందలేదని ఆప్ గుజరాత్ లీగల్ సెల్ ప్రణవ్ ఠక్కర్ చెప్పారు. ప్రదాని మోదీ డిగ్రీ అర్హతను ప్రశ్నిస్తూ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ గుజరాత్ వర్సిటీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, ఉద్దేశ పూర్వకంగా విశ్వవిద్యాలయ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించారని వర్సిటీ రిజిస్ట్రార్ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
మోదీ క్వాలిఫికేషన్ అడిగినందుకు గతంలో కేజ్రీవాల్ కు ఫైన్
ప్రధాని మోదీ క్వాలిఫికేషన్ ఏంటో చెప్పాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గతంలో గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం ఈ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ ద్వారా ఈ వివరాలు బయట పెట్టాలన్న పిటిషన్‌ను కొట్టి వేస్తూ ఈ తీర్పునిచ్చింది. ఇది అనవసరమైన విషయం అని వెల్లడించింది. అంతే కాదు.. ఈ పిటిషన్ వేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు రూ.25 వేల జరిమానా కూడా విధించింది గుజరాత్ హైకోర్టు. ఈ తీర్పుపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రధాని ఏం చదువుకున్నారో తెలుసుకోవడం కూడా తప్పేనా అంటూ మండి పడ్డారు. ఆయన విద్యార్హతలేంటో చెప్పడానికి సమస్యేంటని ప్రశ్నించారు.
'డిగ్రీ చేసే ఉంటే సర్టిఫికేట్ చూపెట్టడానికి ఇబ్బందేంటి?'
మోదీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకునేందుకు కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు ఫైన్ వేయగా.. ఆ తర్వాత కేజ్రీవాల్ పలు సందర్భాల్లో ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడారు. 'అక్కడ ఒకవేళ డిగ్రీ కాగితాలుంటే వర్సిటీ ఎందుకు బయటపెట్టడం లేదు. ఫేక్ సర్టిఫికేట్ కాబట్టే వర్సటీ బయటపెట్టడం లేదేమో! దేశ ప్రధాన మంత్రి తమ విద్యార్థి అని ఢిల్లీ, గుజరాత్ వర్సిటీలు చెప్పుకునేవి కదా!' అని కేజ్రీవాల్ కామెంట్ చేశారు. ఇదే రకమైన కామెంట్లను రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా చేశారు.
ఈ అంశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఇద్దరూ తమ వర్సిటీ పరువుకు భంగం కలిగిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని క్రిమినల్ పరువు నష్టం దావా వేసింది గుజరాత్ వర్సిటీ. ఈ పిటిషన్ ను విచారించిన గుజరాత్ హైకోర్టు. గతంలో అరవింద్ కేజ్రీవాల్ కు, సంజయ్ సింగ్ కు కోర్టు ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది.