Gujarat: గుండెపోటు.. ఈ మధ్యకాలంలో ఎంతో మందిని కబళిస్తోంది. ఎప్పుడు వస్తుందో.. ఎవరికి వస్తుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాం అనుకునే వారు కూడా గుండెపాటు వచ్చి క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్యకాలంలో గుండెపోటు వచ్చి మరణిస్తున్న వారిలో పెద్ద వయస్సు వారి కంటే కూడా యుక్త వయస్సు వారు, నడి వయస్సు వారు, యువతీ యువకులు, చిన్న పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. జిమ్ చేస్తూ కొందరూ, పరిగెత్తుతూ మరికొందరు, ఒకరేమో బరాత్ లో డ్యాన్స్ చేస్తూ, మరొకరేమో ఏదో పనిలో నిమగ్నమైనప్పుడు గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. హుటాహుటినా ఆస్పత్రులకు తరలించినా చాలా కేసుల్లో ఎలాంటి ఫలితం ఉండటం లేదు. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, కలివిడిగా ఉన్న వాళ్లు కూడా అంతలోనే విగతజీవులుగా మారిపోతుండటం కలవరపెడుతోంది. 


తాజాగా గుజరాత్ లో 19 ఏళ్ల ఓ యువకుడు గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. జామ్‌నగర్‌ లోని పటేల్ పార్క్ ప్రాంతంలో ఉన్న స్టెప్ అండ్ స్టెప్ దాండియా అకాడమీలో గర్బా ప్రాక్టీస్ చేస్తుండగా యువకుడికి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఎంతో ఉత్సాహంతో గర్భా ప్రాక్టీస్ చేస్తుండగా.. ఉన్నట్టుండి నేలకూలడంతో.. అక్కడ ఉన్నవారు అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి జీజీ ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. అతడు అప్పటికీ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. 


సోమవారం రాత్రి 10.30 గంటలకు ఈ ఘటన జరిగింది. 19 ఏళ్లు యువకుడికి ఎలాంటి అంతర్గత ఆరోగ్య సమస్యలు లేవని.. అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే యువకుల్లో గుండెపోటు రావడానికి కుటుంబ చరిత్ర, మధుమేహం, రక్తపోటు, జీవనశైలి సమస్యలు, ఊబకాయం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం లాంటి వైద్య సంబంధిత సమస్యలు కారణం కావొచ్చని వైద్యులు చెబుతున్నారు. 


రెండు నెలల క్రితం కబడ్డీ ఆడుతూ.. 19 ఏళ్ల యువకుడి మృతి


అనంతపురం పట్టణంలోని పీవీపీకే కళాశాలలో 19 తునూజ నాయక్ బీ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 1వ తేదీన కాళాశాల గ్రౌండ్ లో కబడ్డీ ఆడుతూ.. తనూజ నాయక్ గ్రౌండ్ లోనే హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన విద్యార్థులు, సిబ్బంది.. తనూజ నాయక్ ను వెంటనే బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య ఆస్పతత్రికి తరలించారు. ఇన్నాళ్లుగా చికిత్స పొందుతున్న తనూజ నాయక్ ఈరోజు తుది శ్వాస విడిచాడు. మృతుడు తనూజ నాయక్ ది మడకశిర మండలంలోని అచ్చంపల్లి తండాకు చెందిన వాడు. ఆడుతూ పాడుతూ హాయిగా తిరుగుతూ చదువుకుంటున్న యువకుడు గుండెపోటుకు గురై చనిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కబడ్డీ ఆడుతుండగా హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలిన తనూజ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీడియో చూసిన ప్రతీఒక్కరూ అయ్యో పాపం అనుకుంటున్నారు. అసలేమైంది ఇంత మంది ఇలా గుండెపోటుతో చనిపోతున్నారని కామెంట్లు చేస్తున్నారు. 


మూడు నెలల క్రితం ఉపాధ్యాయుడి మృతి


పల్నాడు జిల్లా ఫిరంగిపురంకు చెందిన జోజప్ప అనే ఉపాధ్యాయడు రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామం లో ఎంపీపీఎస్ ఎస్సీ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పదో తరగతి ప్రశ్నా పత్రాల మూల్యాంకనం కోసం నరసరావుపేట సెయింట్ ఆన్స్ పాఠశాలకు వెళ్లారు. పేపర్లు వాల్యుయేషన్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఛాతీలో నొప్పి అని చెప్పి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.