Google Flights: బస్సు, రైలు, మెట్రో టికెట్ల ధరలు స్థిరంగా ఉంటాయి. ప్రభుత్వాలు ధరలు పెంచినప్పుడు తప్పితే దాదాపు ఎప్పుడూ ఒకే ధరలో ఉంటాయి. అయితే విమాన టికెట్ ధరలు డైనమిక్ గా ఉంటాయి. అంటే డిమాండ్ కు తగ్గట్లు వాటి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. అందుకే విమానాల్లో ప్రయాణించే వారు చాలా రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకుంటే తక్కువ ధరకే వస్తాయని చెప్పడం తెలిసే ఉంటుంది. అయితే విమాన టికెట్ల ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో చెప్పడం కష్టమే. ఎవరైనా తక్కువ ధరలోనే టికెట్లు దొరకాలని కోరుకుంటాం. కానీ అది అన్నిసార్లు వర్కవుట్ కాదు. కొన్ని సార్లు అయితే టికెట్ కొన్న తర్వాత టికెట్ల ధరలు తగ్గడం చూస్తూనే ఉంటాం. ఈ సమస్యను అధిగమించడం కోసమే గూగుల్ ఫ్లైట్స్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే విమానా టికెట్లను పొందవచ్చు.
ధర పెరుగుతుందా? తగ్గుతుందా?
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సైట్లలో ఏదైనా వస్తువు కొనాలనుకుంటే.. వాటి ధర గతంలో ఏ సమయంలో ఎంత ఉంది, ప్రస్తుతమున్న ధర ఎక్కువా తక్కువా అని తెలుసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే గూగుల్ ఫ్లైట్స్ లో కూడా విమాన టికెట్ ధర గతంతో పోలిస్తే తక్కువుందా.. ఎక్కువుందా అనేది తెలుసుకోవచ్చు. అయితే మనం కొన్న తర్వాత దాని ధర తగ్గుతుందా, పెరుగుతుందా అని మాత్రం చెప్పలేని పరిస్థితి. కొత్తగా తీసుకువచ్చిన ఫీచర్లతో సదరు టికెట్ ధర పెరుగుతుందా, తగ్గుతుందా కూడా తెలుసుకోవచ్చు.
విమానం బయలుదేరే తేదీకి నెలల ముందు వాటి ధరలు బాగా తక్కువగా ఉంటాయి. టేకాఫ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ధరలు పెరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు వివిధ కారణాల వల్ల తగ్గవచ్చు కూడా. అయితే ఈ ట్రెండ్ ను బట్టి కొత్త ఫీచర్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది. దీని వల్ల విమాన టికెట్ ఎప్పుడు కొనవచ్చు అనేది ఒక అంచనాకు రావొచ్చు అని గూగుల్ పేర్కొంది.
ప్రైస్ ట్రాకింగ్ ఆప్షన్
గూగుల్ ఫ్లైట్స్ లో ప్రైస్ ట్రాకింగ్ అనే కొత్త ఫీచర్ ను గూగుల్ తీసుకు రాబోతుంది. ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకుంటే.. ఎప్పుడు విమాన టికెట్ ధరలు తగ్గినా వెంటనే నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ వస్తుంది. మీరు వెళ్లే తేదీని ఎంటర్ చేసి సదరు తేదీకి, మీ ప్రయాణానికి విమాన టికెట్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో ప్రత్యేకంగా సెట్ చేసుకుంటే.. అందుకు తగ్గట్లుగా అలర్ట్స్ వస్తాయి. ఇలా ఫీచర్ ను వాడాలంటే మాత్రం గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ కావాల్సి ఉంటుందని సంస్థ పేర్కొంది.
Also Read: INDIA Alliance Meeting: ముంబయి వేదికగా ప్రతిపక్ష కూటమి సమావేశం, 27 పార్టీలు హాజరు
గూగుల్ బ్యాడ్జ్
విమాన ప్రయాణాలపై గూగుల్ ప్రత్యేకమైన రంగుతో కూడిన బ్యాడ్జ్ లను ఉంచుతుంది. అంటే సదరు విమాన ప్రయాణ టికెట్ ధరలు అంతకంటే తగ్గే అవకాశం లేదని అర్థం. ఒకవేళ అంతకంటే కూడా ఇంకా ధర తగ్గితే.. మీరు చెల్లించిన అధిక మొత్తాన్ని గూగుల్ పే ద్వారా బ్యాంక్ లో డబ్బు పడిపోతుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ ఫీచర్ ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.