Godhra Train Burning Case: 2002 నాటి గోద్రా రైల్ కోచ్ దహనం కేసులో 8 మంది దోషులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. మరో నలుగురు దోషుల పాత్ర దృష్ట్యా వారి బెయిల్ పిటిషన్ ను పరిశీలించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. 2002లో జరిగిన గోద్రా రైలు దహనం, ఆ తర్వాత గుజరాత్ లో జరిగిన మతపరమైన అల్లర్లలో నిందితుల్లో ఒకరికి గతేడాది డిసెంబర్ 15వ తేదీన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం 8 మంది దోషులకు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు ముందు దోషులకు బెయిల్ ఇవ్వొద్దని సుప్రీం కోర్టులో గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దోషులు చేసింది చిన్న నేరం కాదనీ, ప్రయాణికులు బోగీలో నుండి బయటకు రాకుండా తలుపులు బిగించారని, ఆ తర్వాత దానిపై రాళ్లు విసిరారని తుషార్ మెహతా ధర్మాసనానికి గుర్తు చేశారు. గతంలో ట్రయల్ కోర్టు దోషులకు విధించిన మరణ శిక్షను గుజరాత్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడాన్నీ ఆయన సవాల్ చేశారు. 


17 ఏళ్ల పాటు జైలులో ఉన్నారని, బెయిల్ ఇవ్వాలని కోరిన న్యాయవాది


గోద్రా అల్లర్ల దోషులపై టాడా చట్టం ప్రయోగించినట్లు చెప్పిన తుషార్ మెహతా.. ఆ నిందితులకు బెయిల్ ఇచ్చి విడుదల చేయకూడదని విజ్ఞప్తి చేశారు. దోషుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. వారు 17 ఏళ్ల పాటు జైలులో ఉన్నారని, వారికి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా సుప్రీం కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం 8 మందికి బెయిల్ ఇచ్చింది. మరో నలుగురి బెయిల్ పిటిషన్లు తిరస్కరించింది. ఈ 8 మంది దోషులుగా నిర్ధారించబడి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించిన వారి బెయిల్ దరఖాస్తును గుజరాత్ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చినందుకు గాను గతంలో బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని, హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. 


2002లో గోద్రా రైలు కోచ్ పై దాడి


2002 ఫిబ్రవరి 27వ తేదీన గోద్రాలో కరసేవకులు ప్రయాణిస్తున్న సబర్మతి రైలులోని ఎస్6 బోగీని దహనం చేశారు. ఈ ఘటనలో 59 మంది చనిపోయారు. గోద్రా రైలు దహనంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద స్థాయిలో అల్లర్లు జరిగాయి. గుజరాత్ వ్యాప్తంగా హింస చెలరేగింది. ఈ అల్లర్లలో సుమారు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. 


నరోదాగామ్ కేసులో ఊరట


గుజరాత్ అల్లర్లకు సంబంధించిన నరోదాగామ్ కేసులో మాజీ మంత్రి మాయా కొద్నానీ, భజరంగ్ దళ్ కు చెందిన భజరంగీ సహా 67 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. నరోదాగామ్ లో ఇళ్లకు నిప్పు పెట్టడం వల్ల 11 మంది చనిపోయారి. ఈ కేసులో 86 మంది నిందితులుగా గుర్తించగా, విచారణ జరుగుతుండగానే 18 మంది చనిపోయారు.