Bihar Dog Arrest :   బీహార్‌లో అక్రమ మద్యం తరలింపు కేసులో ఓ కుక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌లో మద్యనిషేధం అమల్లో ఉంది. ఎవరైనా మద్యం అక్రమం తీసుకు వస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇలా యూపీ నుంచి వస్తున్న ఓ ఖరీదైన కారులో బీహార్ పోలీసులు సోదాలు చేస్తే ఆరు మద్యంబాటిళ్లు దొరికాయి. దాంతో అందులో ఉన్న వారిని అరెస్ట్ చేశారు. కారులో మొత్తం ముగ్గురు ఉన్నారు. ఇద్దరు యువకులు కాగా.. మరొకరు కుక్క. అందరిపై కేసులు పెట్టేసి లోపలేశారు. కుక్కను మాత్రం కట్టేశారు. 



ఆ కుక్క  ఆషామాషీదేం కాదు. మంచి జాతిరకం కుక్క. హిందీ కూడా రాదు. ఓన్లీ ఇంగ్లిష్. ఇంగ్లిష్ లో మాట్లాడితేనే కాస్త అర్థం చేసుకుంటోంది. దీంతో  పోలీసులకు ఆ కుక్క అవసరాలు తీర్చడం కష్టమైపోతోంది. ప్రత్యేకంగా ఇంగ్లిష్ వచ్చిన వారిని తీసుకొచ్చి దాని దగ్గర పెడుతున్నారు. ఖరీదైన పెడిగ్రీలను కొని పెడుతున్నారు. దీంతో పోలీసుల జేబులు ఖాళీ అవుతున్నాయి. 



మనుషుల్ని అరెస్ట్ చేయవచ్చు కానీ ఇదేం వింత.. కుక్కను ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే.. పోలీసులు నిబంధనలు వల్లే వేస్తున్నారు.  ఎక్సైజ్ చట్టాలను కుక్క ఉల్లంఘించిందనివారు ఘంటా పథంగా చెబుతున్నారు. అయితే జాతి కుక్కను పోలీస్‌ స్టేషన్‌లో ఉంచడం ఖరీదైన వ్యవహారమని పోలీసులు మథనపడుతున్నారు. 


బీహార్ పోలీసుల వ్యవహారం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక వేళ వాళ్లకు బెయిల్ రావడం ఆలస్యం అయితే ఆ పోలీసుల పరిస్థితి ఏమిటనేదిఎక్కువ మందికి వస్తున్న డౌట్ . తమ జీత మొత్తం ఆ కుక్క పోషణకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది సెటర్లు వేస్తున్నారు.