Gay Couple Exchange Rings: దేశంలో గత మూడు నాలుగు రోజులుగా ట్రెండింగ్‌లో ఉన్న అంశం స్వలింగ జంటల వివాహం(same-sex marriage). స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత, ధ్రువీకరణపై సుప్రీంకోర్టు(Supreme Court Of India) మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. స్వలింగ సంపర్కుల వివాహానికి తాము చట్టబద్ధత కల్పించలేమని తెలిపింది. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేసింది. వారు సహజీవనంలో ఉండొచ్చని పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన ఒక రోజు తరువాత సుప్రీం కోర్టు ఎదుట ఆసక్తికర ఘటన జరిగింది.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ విద్యార్థి, రచయిత అనన్య కోటియా(Ananya Kotia), న్యాయవాది ఉత్కర్ష్ సక్సేనా(Utkarsh Saxena) బుధవారం సుప్రీం కోర్టు(Ppex Court) ఎదురుగా ఉంగరాలు మార్చుకుని, తమ నిశ్చితార్థాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పుపై తమ నిరాశను వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు. నిన్నటి రోజు తమను బాధించిందని, ఈ రోజు తమ హక్కులను నిరాకరించిన కోర్టుకు తిరిగి వెళ్లి, ఉంగరాలు మార్చుకున్నట్లు తెలిపారు. ఈ వారం కోర్టు నిర్ణయంపై కాదని, మా నిశ్చితార్థం గురించి అంటూ రాసుకొచ్చారు. తమ పోరాటాన్ని కొనసాగించడానికి మరొక రోజు తిరిగి వస్తామని పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఇప్పటి వరకు 7.5 లక్షలకు పైగా మంది పోస్ట్ చూశారు. అలాగే వందల మంది కామెంట్లు పెట్టారు. 1,150 మంది రీ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ‘ప్రేమ అనేది ప్రాథమిక హక్కు, మీకు శుభాకాంక్షలు’ అని ఒక నెటిజన్ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. మరొకరు స్పందిస్తూ ‘మీ ఇద్దరికీ అభినందనలు. ఏదో ఒక రోజు మీరు కలలుగన్న హక్కులు మీకు లభిస్తాయని ఆశిస్తున్నాను’ అంటూ కామెంట్ చేశారు. ‘అభినందనలు అబ్బాయిలు. మీ ఇద్దరికీ బోలెడంత ప్రేమ, ఆశీస్సులు’ అని మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు. ‘విష్ యు ఎ వెరీ లవ్లీ - లీ హ్యాపీ టుగెదర్. స్టే బ్లెస్డ్’ అంటూ ఇంకో వ్యక్తి కామెంట్ చేశారు.
విమర్శలు సైతం
సుప్రీం కోర్టు ఎదుట ఉంగరాలు మార్చుకున్న అనన్య కోటియా, ఉత్కర్ష్ సక్సేనా జంటకు అభినందనలతో పాటు విమర్శలు సైతం అదే స్థాయిలో వస్తున్నాయి. నల్లకోటు, బ్యాండ్ కోర్టులో ధరించడానికి ఉద్దేశించినవని, వారి వ్యక్తిగత కార్యక్రమాల కోసం కాదంటూ ఒకరు మండిపడ్డారు. వారి హక్కుల కోసం నల్లగౌను ప్రతిష్టను దుర్వినియోగం చేయొద్దంటూ హితవు పలికారు. ఇంకొకరు స్పందిస్తూ ఇతంతా చూసి మీ తల్లిదండ్రులు ఏమై పోతారో ఎప్పుడైనా ఆలోచించారా? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి చెడు పనులతో సమాజానికి ఏం మెస్సేజ్ ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరో వ్యక్తి స్పందిస్తూ హిందూ మతాన్ని వీటన్నింటికి దూరంగా ఉంచాలని, ఇద్దరు అబ్బాయిలు నిశ్చితార్థం చేసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని 20 స్వలింగ జంటలు వేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇటీవల తీర్పు వెల్లడించింది. దీనిపై పార్లమెంటే చట్టం చేయాలన్ని ధర్మాసనం, స్వలింగ సంపర్కం జంటలపై ఎలాంటి వివక్ష చూపించొద్దని, వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుతో దేశంలో మరోసారి స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత అంశం ట్రెండింగ్‌లో ఉంది.