G20 Summit 2023: 



G20 షెర్పాగా అమితాబ్ కాంత్ 


G20 సదస్సు రెండో రోజుకి చేరుకుంది. నేడు (సెప్టెంబర్ 10) పూర్తిస్థాయిలో వాతావరణ మార్పులపై చర్చ జరగనుంది. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీ డిక్లరేషన్‌ని G20 సభ్యులందరూ ఆమోదించారు. దీనిపై భారత్ సంతోషం వ్యక్తం చేసింది. రెండో రోజు కూడా ఫలవంతమైన చర్చలు జరుగుతాయని ధీమాగా చెబుతోంది. అయితే...ఈ సదస్సులో ఎలాంటి అవాంతరాలు రాకుండా...షెడ్యూల్‌లో ఎలాంటి తేడాలు రాకుండా చూసుకున్నారు G20 Sherpa.సింపుల్‌గా చెప్పాలంటే...ఈ మొత్తం సమ్మిట్‌కి వీళ్లే లీడర్‌లు. భారత్ G20 షెర్పాగా బాధ్యతలు తీసుకున్నారు అమితాబ్ కాంత్. టీమ్‌తో కలిసి ఈ సదస్సు సక్సెస్ అయ్యేలా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం దాదాపు 200 గంటల పాటు చర్చలు జరిగాయని వెల్లడించారు అమితాబ్ కాంత్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోయినా చివరకు అది సాధించింది భారత్. ఈ విషయంలో షెర్పా పాత్ర కీలకం. 300 ద్వైపాక్షిక చర్చలు జరిపి 15 డ్రాఫ్ట్‌లు ఈ సదస్సులో ప్రవేశపెట్టారు. ఆ తరవాత వీటన్నింటికీ G20 నేతలు ఆమోద ముద్ర వేశారు. ఈ ఘనత సాధించడంపై తన టీమ్‌ని అభినందించారు అమితాబ్ కాంత్. స్పెషల్ ట్వీట్ కూడా చేశారు. 


"రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో సభ్యులందరూ ఏకాభిప్రాయానికి రావడమే అతిపెద్ద సవాలు. కానీ దీన్ని సాధించగలిగాం. ఇందుకోసం 200 గంటల పాటు చర్చలు జరిగాయి. 300 ద్వైపాక్షిక చర్చలు నిర్వహించాల్సి వచ్చింది. ఇదంతా సాధ్యం కావడానికి నా టీమ్‌ మెంబర్సే కారణం. నాకు అన్ని విధాలుగా సహకరించారు"


- అమితాబ్ కాంత్, G20 భారత్ షెర్పా