G20 Summit 2023: 


బైడెన్ కాన్వాయ్‌లో అలజడి...


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాన్వాయ్‌లోని ఓ డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రైవింగ్ చేసే క్రమంలో నిర్లక్ష్యం వహించడంపై బైడెన్ సెక్యూరిటీ సీరియస్ అయింది. వెంటనే అతడిని తొలగించింది. ఆ తరవాత కాసేపు ప్రశ్నించి వదిలేసింది. ఇంతగా సీరియస్ అవ్వడానికి ఓ కారణముంది. బైడెన్ కాన్వాయ్‌లోని ఓ కార్‌ అనుకోకుండా తాజ్‌ హోటల్‌లోకి వచ్చింది. యూఏఈ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అక్కడే బస చేస్తున్నారు. అక్కడికి మరే కార్‌నీ అనుమతించరు. కానీ...బైడెన్ కాన్వాయ్‌లోని ఓ డ్రైవర్‌ ఉన్నట్టుండి తాజ్‌ హోటల్‌లోకి వెళ్లిపోయాడు. ఇది గమనించిన సెక్యూరిటీ వెంటనే అప్రమత్తమైంది. కార్‌ని ఆపి డ్రైవర్‌ని నిలదీసింది. ITC మౌర్య హోటల్ అనుకుని తెలియక లోపలకు వచ్చేశానని వివరణ ఇచ్చాడు ఆ డ్రైవర్. కరెక్ట్‌ టైమ్‌కి అక్కడ ఉండాలని, అందుకే వచ్చాని చెప్పాడు. జో బైడెన్ ITC మౌర్యలో బస చేశారు. అదే హోటల్ అనుకుని తాజ్ హోటల్‌లోకి ఎంటర్ అయ్యాడు ఆ డ్రైవర్. అక్కడే ఓ బిజినెస్‌మేన్‌ని డ్రాప్ చేశాడు. ప్రోటోకాల్‌ సరిగ్గా తెలియకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. కాసేపు అతడిని ప్రశ్నించి ఆ తరవాత వదిలేశారు. 


షేప్‌ ఆఫ్ యూ పాటతో వెల్‌కమ్..


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీకి వచ్చిన సమయంలో ఆయనకు ఆహ్వానం పలికే క్రమంలో కేంద్రం పెద్ద తప్పు చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆయన ఎయిర్‌పోర్ట్‌లో దిగే సమయానికి అక్కడ అసందర్భమైన పాటను పెట్టి కించపరిచారని మండి పడుతున్నాయి. Ed Sheeran కంపోజ్ చేసి పాడిన Shape of You పాటని ప్లే చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేంద్రమంత్రులు బైడెన్‌ని ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ పాటలు వినిపించాయి. అదే పాటకు స్టేజ్‌పై డ్యాన్సర్‌లు డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. జో బైడెన్‌ వచ్చినప్పుడే కాదు. అర్డెంటీనా ప్రెసిడెంట్ అల్బర్టో ఫెర్నాండెజ్ వచ్చినప్పుడూ ఇదే పాట వినిపించింది. అయితే...ఈ పాటని యాజిటీజ్‌గా కాకుండా ఇండియన్ మ్యూజిక్‌తో మిక్స్ చేసిన ఓ రెండిషన్‌ని ప్లే చేశారు. అయినా...అందులో లిరిక్స్ అభ్యంతరకరంగా ఉంటాయని, అలాంటి పాటను దేశాధినేతలు వచ్చినప్పుడు పెట్టడమేంటని కొందరు వాదిస్తున్నారు. వీళ్లకు కాంగ్రెస్ నేతలూ మద్దతు పలికారు. ఇది కచ్చితంగా అవమానమే అని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనాతే ఈ పాటలోని లిరిక్స్‌ కూడా ట్విటర్‌లో షేర్ చేశారు. దేశాధినేతల్ని షేప్ ఆఫ్ యూ పాటతో వెల్‌కమ్ చేయడం దారుణం అని పోస్ట్ పెట్టారు. కొందరు నెటిజన్లు కూడా దీనిపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. చక్కగా మన ఇండియన్ పాటేదైనా పెట్టుకోవచ్చుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.