Former Karnataka CM SM Krishna : కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ మంగళవారం (డిసెంబర్ 10) ఉదయం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. బెంగళూరులోని తన నివాసంలో మంగళవారం ఉదయం 2.45 గంటలకు కన్నుమూశారు. 11 అక్టోబర్ 1999 నుంచి 20 మే 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 6 డిసెంబర్ 2004నుంచి 8 మార్చి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పని చేశారు. 


ఎస్ఎం కృష్ణ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల దేశంలోని సీనియర్ నాయకులంతా సంతాపం వ్యక్తం చేశారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రియాంక్ ఖర్గే సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.


ప్రజల కోసం అవిశ్రాంతంగా శ్రమించారు; ప్రధానమంత్రి మోదీ


ఎస్‌ఎం కృష్ణ మృతి పట్ల ప్రధానమంత్రి మోదీ కూడా సంతాపం తెలియజేశారు. ప్రజల కోసం వారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రమించారని గుర్తు చేశారు. "SM కృష్ణ ఒక అద్భుతమైన నాయకుడు, అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని పొందారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అవిశ్రాంతంగా పనిచేశారు. కర్నాటక ముఖ్యమంత్రిగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. గొప్ప పాఠకుడు, ఆలోచనాపరుడు" అని మోదీ ఎక్స్‌పో పోస్టు పెట్టారు. 


అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు 


కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణతో ఉన్న అనుబంధాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతికి సంతాపంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన చంద్రబాబు ఇలా రాసుకొచ్చారు. "కర్ణాటక మాజీ సిఎం ఎస్ఎం కృష్ణ మరణం గురించి విని చాలా బాధపడ్డాను. మా స్నేహం రెండు రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడానికి పోటీ తత్వంగా మార్చుకున్నాం. తన ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిచ్చే నిజమైన నాయకుడు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను." 


ప్రియాంక్ ఖర్గే సంతాపం 
ప్రియాంక్ ఖర్గే సోషల్ మీడియాలో ఇలా రాశారు, "ఎస్ఎం కృష్ణ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యమంత్రిగా, నాయకుడిగా, రాష్ట్రం, దేశంపై చెరగని ముద్ర వేశారు. ఆయన అంకితభావంతో కర్ణాటకను పురోగతి మార్గంలో నడిచాయి. బెంగుళూరుకు సంబంధించిన విధానం ఆయనను చాలా మందికి ప్రియమైన వ్యక్తిగా మార్చింది. బెంగుళూరును గ్లోబల్ సిటీగా రూపొందించాలన్న ఆయన దార్శనికత ప్రయోజనాలను ఇవాళ పొందుతున్నాం. అది రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది."


ఎస్‌ఎం కృష్ణ పూర్తి పేరు సోమనహళ్లి మల్లయ్య కృష్ణ. మే 1, 1932న మద్దూరు తాలూకాలోని సోమనహళ్లి గ్రామంలో జన్మించారు. మైసూర్‌లో ప్రాథమిక, అండర్ గ్రాడ్యుయేట్ విద్య పూర్తి చేశారు. బెంగుళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. మద్దూరు నుంచి ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 


మరో సీనియర్ నేత రామచంద్రన్  కన్నుమూత


మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి MDR రామచంద్రన్ అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం (8 డిసెంబర్ 2024) కన్నుమూశారు. ఆయన కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎండీఆర్‌ మృతి పట్ల సంతాపం తెలిపిన పుదుచ్చేరీ సీఎం రంగస్వామి మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. అధికారిక లాంఛనాలతో ఎండీఆర్‌ అంత్యక్రియలు స్వగ్రామం మదుకరైలో జరగనున్నాయి. పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.రంగసామికి మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించి, ఆయన అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు.


రామచంద్రన్ 1969లో ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) టిక్కెట్‌పై నెట్‌పాక్కం నియోజకవర్గం నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి వెంకటసుబ్బారెడ్డిని ఓడించి, మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు.  డిఎంకే, అన్నా డీఎంకే రెండింటికీ ప్రాతినిధ్యం వహించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 


డీఎంకేలో ఉన్నప్పుడు రెండుసార్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 16 జనవరి 1980 నుంచి 23 జూన్ 1983 వరకు తొలిసారి, 8 మార్చి 1990 నుంచి 2 మార్చి 1991 వరకు రెండోసారి CMగా ఉన్నారు. తరువాత, రామచంద్రన్ DMKని విడిచిపెట్టి 2000లో కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ 11 జూన్ 2001 నుంచి 26 మే 2006 వరకు పుదుచ్చేరి స్పీకర్‌గా ఉన్నారు. ప్రస్తుతం పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. 


Also Read: వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఒకే దేశం, ఒకే ఎన్నికల చట్టం అమలు - పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు