కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆగస్టు 13, 2021 న దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ శాఖ కార్యదర్శి ఉషా శర్మ తెలియజేశారు. ఆ శాఖ సహాయ మంత్రి, నిసిత్ ప్రామాణిక్, CISF, BSF, CRPF, NYKS, NSG, ITBP, SSB తో పాటూ రైల్వే వంటి సంస్థలు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాయని చెప్పారు. ఫిట్ ఇండియా వెబ్ పోర్టల్‌లో వ్యక్తులు ఎవ్వరైనా నమోదు చేసుకోవచ్చు.




ఎప్పుడు నిర్వహిస్తారు



  • ఈ సంవత్సరం, ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్స్ 2.0 ఆగస్టు 13, 2021 నుంచి అక్టోబర్ 2, 2021 వరకు జరుగుతుంది.

  • మొదటి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ఆగస్టు 15, 2020 నుండి అక్టోబర్ 2, 2020 వరకు జరిగింది.


ఎలా నిర్వహిస్తారు



  • అక్టోబర్ 2, 2021 వరకు ప్రతి వారం 75 జిల్లాల్లో ప్రతి వారం కార్యక్రమాలు జరుగుతాయి.

  • ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్స్ 744 జిల్లాలు, 744 జిల్లాలలో 75 గ్రామాలు...ఇంకా దేశవ్యాప్తంగా 30,000 విద్యా సంస్థల్లో నిర్వహిస్తారు

  • ఈ కార్యక్రమం దాదాపు 7.50 కోట్లకు పైగా పౌరులకు చేరుతుంది


ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్స్ 2.0 యొక్క ఉద్దేశ్యం



  • ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్స్ 2.0 లక్ష్యం ఏంటంటే ప్రజలు తమ రోజువారీ జీవితంలో క్రీడలు, రన్నింగ్, ఫిట్ నెస్ పై దృష్టిసారించడమే కాదు... సోమరితనం, స్థూలకాయం, ఆందోళన, వ్యాధులు, ఒత్తిడిని జయించేలా ప్రోత్సహించడమే.

  • ఈ ప్రచారంలో పౌరులు తమ జీవితంలో రోజూ కనీసం 30 నిమిషాల శారీరక శ్రమ చేయాలనే సంకల్పం చేసుకోవాలి . 'ఫిట్‌నెస్ కా డోస్, ఆధా ఘంటా రోజ్' అనే నినాదంతో జీవించాలన్న లక్ష్యంగా పెట్టుకోవాలి.




ఫిట్ ఇండియా ఉద్యమం గురించి


ఒక దేశం అభివృద్ధి చెందాలంటే... ఆ దేశంలో ప్రజలు ఫిట్‌గా ఉండాలి. కొడితే గోడలు బద్ధలైపోయేలా... బలంగా ఉండాలి. అప్పుడే రికార్డులు బద్ధలవుతాయి. సరికొత్త చరిత్ర లిఖించగలం. ఇదే స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ... ఫిట్ ఇండియా ఉద్యమాన్ని 2019  జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న ప్రారంభించారు.  ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడం, ప్రచారాల ద్వారా ఫిట్‌నెస్ కార్యకలాపాల గురించి అవగాహన కల్పించడం, దేశీయ క్రీడలను ప్రోత్సహించడం, ప్రతి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలు, గ్రామాలకు ఫిట్‌నెస్ నియమావళిని అందించడం దీని ముఖ్య ఉద్దేశం. సాధారణంగా  ఫిట్‌గా ఉండటమనేది క్రీడాకారులు, యాక్టర్లు, సెలబ్రిటీలకు సంబంధించిన వ్యవహారంగా భావిస్తుంటాం. నిజానికి ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలి. రోజూ వ్యాయామాలు, వాకింగ్, జాగింగ్ వంటివి చెయ్యాలి. ఒంట్లో అనవసరంగా ఉన్న కొవ్వు, అధిక బరువును తొలగించుకోవాలి. అందుకోసం ఉద్దేశించినదే ఫిట్ ఇండియా ఉద్యమం.