బ్రిటీష్ వారి పాలన నుంచి భారతదేశానికి 1947 ఆగస్టు 15న విముక్తి లభించింది. దేశ తొలి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ ప్రకటనతో భారతీయులకి సూర్యోదయం అయ్యింది. నాటి నుంచి నేటి వరకూ ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొంటూ వచ్చిన మనం ఈ సంవత్సరం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే కరోనాకి ముందు ఆ తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి. గతంలో ప్రత్యక్షంగా వేడుకల్లో పాల్గొని సంబరాలు చేసుకునేవారం. కానీ ఏడాదిన్నరగా ఆ పరిస్థితి లేదు. కరోనా వల్ల బయట అడుగుపెట్టేందుకే భయపడుతున్నారంతా. అయితే భారతీయులు గర్వించాల్సిన ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను ఏవిధంగా అనుకూలంగా మార్చుకోవాలో ఆలోచించాలి. ఇంటికే పరిమితం అయ్యాం..వేడుకల్లో పాల్గొనలేకపోయాం అని బాధపడాల్సిన అవసరం లేదు…ఎందుకంటే ఎక్కడివారక్కడే స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవచ్చు…
త్రివర్ణ వంటకాలు చేసి ఆనందించండి...
స్పెషల్ ఫుడ్ లేకుండా ఏ భారతీయ పండుగ పూర్తికాదు. అందుకే స్వాతంత్ర్య దినోత్సవం రోజున త్రివర్ణాల్లో వంటలు తయారు చేసి కుటుంబంతో మంచి సమయాన్ని గడపండి. అల్పాహారం కోసం త్రివర్ణ శాండ్‌విచ్, మధ్యాహ్న భోజనానికి త్రివర్ణ-పులావ్, సాయంత్రం త్రివర్ణ ఇడ్లీని ప్రిపేర్ చేయండి. ఏదో శాంపిల్ గా చెప్పాం...ఇంకా ఎన్నో వంటలు చేయొచ్చు..
దేశభక్తి ప్రసంగాలతో కుటుంబంతో సమయం వెచ్చించండి
ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని మీ కుటుంబంతో గడపండి. దేశభక్తి ప్రసంగాలు వింటూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారి త్యాగాలు, వారి అంకితభావాన్ని అర్థం చేసుకోండి. స్వాతంత్ర్య పోరాటం గురించి పిల్లలకు మరింత తెలుసుకోవడానికి ఇది గొప్ప మార్గం. మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ప్రసంగం, బాల గంగాధర్ తిలక్ స్వరాజ్ నా జన్మహక్కు వీటితో పాటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వారి ప్రసంగాలను వినండి.
చెట్టు నాటండి!
ప్రాణాంతకమైన కరోనావైరస్ కారణంగా వేలమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి-సామరస్యం చిహ్నంగా ఓ మొక్క నాటండి. ముందుగానే ఓ సమయాన్ని నిర్ణయించుకుని మీ కుటుంబ సభ్యులందర్నీ భాగస్వాములను చేయండి. త్రివర్ణాల్లో కుండకు పెయింటింగ్స్ వేసుకోండి. మీ కుటుంబంతో పాటూ స్నేహితులను, కొలిగ్స్ తో కూడా ఈమంచి పని చేయించండి.
ఆన్‌లైన్ దేశభక్తి కవితలు, పద్యాలు, పాటలు
ఆన్ లైన్లో దేశభక్తి కవితలు, పద్యాలు, పాటల పోటీలు నిర్వహించుకోవచ్చు. హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన ఆజాది కా గీత్, రామ్ ప్రసాద్ బిస్మిల్ రాసిన సర్ఫరోషి కి తమన్నా, రవీంద్ర నాథ్ టాగూర్ లాంటి వారు రాసిన పోయట్రీని ఆన్ లైన్ కాంపిటేషన్ పెట్టుకోవడమే స్వాతంత్ర్య సమరయోధులకు మనం ఇచ్చే గొప్ప నివాళి.
దేశభక్తిని పెంచే పుస్తకాలు చదవడం
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే...భారతదేశం-పాకిస్తాన్ విభజనలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవాలి.ఎవరు ఎలాంటి పుస్తకాలు చదవాలో కుటుంబ సభ్యులంతా కూర్చుని చర్చించుకుని...ఆ తర్వాత తమ భావాలను అందరితో పంచుకోవచ్చు. విభజన సాహిత్యంలో ఊర్వశి బుటాలియా రచించిన ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్, కుష్వంత్ సింగ్ ద్వారా పాకిస్తాన్‌కు రైలు, యాస్మిన్ ఖాన్ ద్వారా ది గ్రేట్ పార్టిషన్లాంటి పుస్తకాలు ఎంపిక చేసుకోవచ్చు.
త్రివర్ణ గృహాలంకరణ
కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన వారంతా ఇంటిని త్రివర్ణాలతో అలంకరించి దేశభక్తిని చాటుకోవచ్చు. గోడలు, షెల్పులు, వాల్ హ్యాంగింగ్స్ , తలుపులు ఇల్లంతా పాత ట్రై కలర్ దుపట్టాలతో డెకరేట్ చేసుకోవచ్చు. దేశభక్తిని పెంచే సంగీతాన్ని వింటూ కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో భాగం అవొచ్చు. ఎవరి సృజనాత్మకతను వారు ప్రదర్శించేందుకు ఇదే మంచి అవకాశం
స్కిట్ లు వేయొచ్చు...
మీ కుటుంబ సభ్యులను రెండు బృందాలుగా విభజించి... ప్రతి ప్రతి బృందంలో ఒక సభ్యుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వాతంత్ర్య సమరయోధులను అనుకరించొచ్చు. మంగళ్ పాండే, భగత్ సింగ్ లేదా ఇతరుల పేర్లు పెట్టుకుని వారి నినాదాలు, పోరాట శైలి, దుస్తులు ఇలా ఎవరి ఆశక్తిని వారు ఫాలో అవొచ్చు.
దేశభక్తిని పెంచే సినిమాలు చూడొచ్చు
స్వాతంత్ర్య దినోత్సవం రోజు రాత్రి దేశభక్తి సినిమాలపై దృష్టి సారించండి. ఇంట్లో అందరి సభ్యుల అభిప్రాయాలు సేకరించి మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని సినిమా ఎంపిక చేసుకోండి. రంగ్ దే బసంతి, లగాన్, కేసరి, ది లెజెండ్ ఆఫ్ భఘర్ సింగ్, ఖడ్గం..ఇలా ఏ సినిమా అయినా సరే పెట్టుకుని దేశభక్తిని ఆస్వాదించండి. అనంతరం ఆ సినిమాపై ఆరోగ్యకర చర్చ పెట్టుకోండి.
బయటకు వెళ్లి జెండాకు వందనం చేస్తేనే దేశభక్తి అని కాదు...అవకాశం లేదనుకున్న సమయంలో పై విధంగా కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవచ్చు....ఇంకెందుకు ఆలస్యం...మీకు ఏ పద్ధతి నచ్చిందో దాన్ని ఫాలో అవండి మరి...