Snow Leopards News: న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 718 మంచు చిరుతలు ఉన్నాయని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Wildlife Institute of India) తెలిపింది. వీటిలో లడఖ్‌లో భారీ సంఖ్యలో మంచు చిరుతలు ఉన్నాయని ఇటీవల నిర్వహించిన తొలి సైంటిఫిక్ ట్రాకింగ్ లో గుర్తించినట్లు డబ్ల్యూఐఐ పేర్కొంది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని జంతు సంరక్షణ కేంద్రాల్లో , మంచు చిరుత పిల్లలు, రెడ్‌ పాండా కూనలు సందడి చేసిన సమయంలో మంచు చిరుతల విషయం వైరల్‌గా మారింది.


మంచు చిరుత సంఖ్య అంచనా కోసం సర్వే.. 
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో డబ్ల్యూఐఐ తాజా నివేదికను విడుదల చేశారు. భారతదేశంలో మంచు చిరుత సంఖ్య అంచనా (SPAI) కోసం తొలి సర్వే ప్రక్రియ ఇది. ఈ మంచు చిరుతల సంఖ్యను తేల్చేందుకు చేపట్టిన ప్రక్రియకు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా జాతీయ కోఆర్డినేటర్‌గా ఉంది. ఇందులో రెండు పరిరక్షణ కేంద్రాలు, మంచు చిరుత ఉన్న రాష్ట్రాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. 


లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు ట్రాన్స్ హిమాలయన్ ప్రాంతం సుమారు 120,000 కి.మీ. మేర మంచు చిరుత ఆవాసాలను కవర్ చేస్తూ తొలిసారిగా సైంటిఫిక్ సర్వే నిర్వహించారు. అదే ప్రాంతాల్లో 70 శాతం మంచు చిరుతలు ఉన్నాయని అంచనాకు వచ్చారు. వీటితో పాటు ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మంచు చిరుతలు ఉన్నాయి. 2019 నుంచి 2023 వరకు రెండు దశలలో మంచు చిరుతల సంఖ్యను నిర్ధారించేందుకు శాస్త్రీయ పద్ధతిలో కొన్ని జంతు పరిరక్షణ కేంద్రాల సాయంతో డబ్ల్యూఐఐ ఈ సర్వేను పూర్తిచేసి కేంద్రానికి నివేదిక సమర్పించింది.


13,450 కి.మీ మేర 1,971 పలు ప్రాంతాల్లో 1,80,000 (1 లక్షా 80 వేల)  ట్రాప్ కెమెరాలను ఏర్పాట్లు చేసి సర్వే చేపట్టారు. మొత్తం 241 ప్రత్యేకమైన మంచు చిరుతలను ట్రాప్ కెమెరాలు ఫోటో తీశాయి. సర్వే డేటా పరిశీలిస్తే.. అత్యధికంగా లడఖ్ (477), ఆ తరువాత స్థానాల్లో ఉత్తరాఖండ్ (124), హిమాచల్ ప్రదేశ్ (51), అరుణాచల్ ప్రదేశ్ (36), సిక్కిం (21), జమ్మూ కాశ్మీర్ (9) మంచు చిరుతలు ఉన్నాయని అంచనా వేశారు. 


2016కి ముందు, లడఖ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో మంచు చిరుతల సంచారంపై ఫోకస్ చేశారు. 2016లో 56 శాతం ప్రాంతంలో వీటి సంచారాన్ని లెక్కించాలని చూడగా, ప్రస్తుతం 80 శాతం ఏరియాలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి తొలిసారి సైంటిఫిక్ సర్వే చేసి దేశంలో 718 మంచు చిరుతలు ఉన్నాయని ప్రకటించారు. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రత్యేక మంచు చిరుత విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని నివేదిక పేర్కొంది. ప్రతి నాలుగేళ్లకు ఓసారి మంచు చిరుతల సంఖ్యపై సర్వే జరగాలని నిపుణులు సూచించారు. 


మంచు చిరుతలు చాలా ప్రమాదకరం
మంచు చిరుతలు హిమాలయ పర్వతాల్లో, ఇలాంటి మంచు వాతావరణంలో జీవిస్తాయి. మంచు ప్రదేశాల్లో ప్రమాదకరమైన జంతువుల్లో మంచు చిరుతలు ఒకటి. మంచు చిరుతలు తమ బరువు కంటే మూడు రెట్లు పెద్దగా ఉన్న జంతువులను సైతం వేటాడి చంపే సామర్థ్యం ఉన్న జంతువులు అని చెబుతున్నారు. ఇవి చాలా ప్రమాదకరమైనవి, అందులోనూ చల్లని ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఇవి ఆవాసం ఉన్న కారణంగా ఇప్పటివరకూ వీటి సంఖ్యపై గతంలో ఎలాంటి సైంటిఫిక్ సర్వే, రీసెర్చ్ జరపలేదని అధికారులు వెల్లడించారు.