Farmers Protest In Punjab-Haryana Boarder: కేంద్రం - రైతుల మధ్య సందిగ్ధత కొనసాగుతోంది. ఇరు వర్గాల మధ్య చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే రైతులు శుక్రవారం భారత్ బంద్ చేపట్టారు. రైతుల నిరసన నాలుగు రోజులకు చేరిన సందర్భంగా డిమాండ్లను పరిష్కారించాలని కోరుతూ రైతు సంఘాలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ కొనసాగనుంది. 


దీంతో పోలీసులు ఢిల్లీలో 144 సెక్షన్ అమలు పరిచారు. ఢిల్లీ - ఎన్‌సీఆర్ పరిధిలో ఒకేసారి ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు పెద్దగా గుమిగూడడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద సమావేశాలు, బహిరంగ సభలపై నిషేధం విధించారు. ఉదయం 6 గంటలకు భారత్ బంద్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు బంద్ కొనసాగతుందని నిరసనకారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రధాన రహదారులను దిగ్భంధించనున్నట్లు రైతులు తెలిపారు. 


18న రెండో విడత చర్చలు
ఇప్పటికే నోయిడాకు చెందిన భారతీయ కిసాన్ పరిషత్ దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఇవ్వడంతో ఆందోళనను తీవ్రతరం చేస్తామని రైతులు తేల్చి చెప్పారు. సమస్యలపై పరిష్కారం కోసం గురువారం రైతు సంఘాల నేతలు, ముగ్గురు కేంద్ర మంత్రులు ఐదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయినా చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదు. దీంతో ఫిబ్రవరి 18 ఆదివారం మరో విడత చర్చలు జరగనున్నాయి.  


రెచ్చగొడుతున్న బలగాలు
ఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో మోహరించిన పారామిలటరీ బలగాలు ఆందోళన చేస్తున్న తమను రెచ్చగొడుతున్నాయని రైతులు ఆరోపించారు. గురువారం కేంద్రంతో తమ చర్చల సందర్భంగా రైతు సంఘాల నాయకులు ప్రస్తుత పరిస్థితిని మంత్రులకు వివరించారు. రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ మాట్లాడుతూ.. తామేమీ పాకిస్థానీలం కాదని, సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారని అన్నారు. సమస్యలపై కేంద్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఆందోళన మరింత ఉధృతం అవుతుందని, ఢిల్లీకి వెళ్తామని అన్నారు.


ఆందోళన చేస్తున్న రైతులకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంఘీభావం తెలిపారు. హర్యానాతో రాష్ట్ర సరిహద్దుల్లో డ్రోన్లను ఉపయోగించడం, ముళ్ల కంచెలు వేయడంపై ఆయన విమర్శలు చేశారు. ప్రభుత్వం రైతులపై సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని మండిపడ్డారు. హర్యానా జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని కూడా విమర్శించారు.


ప్రజలకు పోలీసుల సూచనలు
రైతు సంఘాల బంద్ నేపథ్యంలో సెక్షన్ 144 కింద అనధికార బహిరంగ సభలపై నిషేధం విధించినట్లు గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు గురువారం తెలిపారు. ఢిల్లీ - నోయిడా - ఢిల్లీ మధ్య సాధ్యమైనంత వరకు మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడడం, రాజకీయ, మతంతో సహా అనధికార ఊరేగింపులు, ప్రదర్శనలను నిషేధించినట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ సంస్థలకు ఒక కిలోమీటరు పరిధిలో ప్రైవేట్ డ్రోన్‌ల వినియోగాన్ని కూడా ఈ ఉత్తర్వు నిషేధించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు కర్రలు, రాడ్‌లు, త్రిశూలాలు, కత్తులు, తుపాకీలు తీసుకెళ్లడాన్ని నిషేధించారు.


నోయిడా, ఢిల్లీ సరిహద్దుల్లో ఇరువైపులా పోలీసులచే బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తారని, ఫలితంగా వాహనాల రాకపోకలపై ప్రభావం ఉంటుందని, అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లించబడుతుందని పోలీసులు తెలిపారు. యమునా ఎక్స్‌ప్రెస్‌ వే నుంచి నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌ వే మీదుగా ఢిల్లీకి, సిర్సా నుంచి పారి చౌక్ మీదుగా సూరజ్‌పూర్ వరకు అన్ని రకాల వస్తువుల వాహనాల రాకపోకలపై నిఘా ఉంటుందన్నారు. ట్రాఫిక్‌ను నివారించడానికి, డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని పోలీసులు తెలిపారు.
  
సమస్యను పరిష్కరించాలని కోరుతున్న ప్రజలు
రైతుల సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చర్చలు జరపాలని వ్యాపారులు కోరుతున్నారు. తరచుగా జరిగే రైతు ఉద్యమాలు రోజువారీ వ్యాపార కార్యకలాపాలపై ప్రతికూలంగా మారుతున్నాయని, ప్రజలు అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మార్గాలను మూసివేయడంతో ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారని నోయిడా సెక్టార్ 18 మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సుశీల్ కుమార్ జైన్ అన్నారు.