పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీడ్కోలు కార్యక్రమం శనివారం పార్లమెంట్‌లో ఘనంగా జరిగింది. రాజ్యాంగ అధిపతిగా ఉన్న కోవింద్ పదవీకాలం నేటితో ముగిసింది. అందుకే కోవింద్‌కు రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు ఇద్దరూ సంయుక్తంగా వీడ్కోలు పలికారు.  ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. 


స్పీకర్ ఓం బిర్లా పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి కోవింద్‌కు పార్లమెంటేరియన్ల తరపున ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఎంపీలందరూ సంతకం చేసిన మెమెంటో, సంతకాల పుస్తకాన్ని కూడా ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన కోవింద్‌..."ఐదేళ్ల క్రితం, నేను ఇక్కడ సెంట్రల్ హాల్‌లో భారత రాష్ట్రపతిగా ప్రమాణం చేశాను. ఎంపీలందరికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది" అని అన్నారు.


"పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం, పార్లమెంటులో చర్చోపచర్చల్లో, హక్కులను వినియోగించుకునే సమయంలో ఎంపీలు ఎల్లప్పుడూ గాంధీ తత్వాన్ని అనుసరించాలి" అని కోవింద్ అన్నారు.






కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి తన శుభాకాంక్షలు తెలియజేశారు రామ్‌నాథ్‌ కోవింద్. "తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నేను ద్రౌపది ముర్ముని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆమె మార్గదర్శకత్వంలో మరిన్ని అద్భుతాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను." అని అన్నారు.


ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ "నా పదవీ కాలంలో మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోదీ, మంత్రిమండలి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలకు ధన్యవాదాలు."






కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచం ఇబ్బందులు పడుతోంది. మహమ్మారి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామని నేను ఆశిస్తున్నాను, మనమందరం ప్రకృతిలో భాగమని మరచిపోయాము. కష్ట సమయాల్లో భారతదేశం ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. అని తన వీడ్కోలు ప్రసంగంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు.