Shiv Sena Row:
మెజార్టీ నిరూపించుకోండి: ఈసీ
మహారాష్ట్రలో రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడు వారాలు దాటినా ఇంకా శివసేన ఎవరిది అన్న చర్చ వాడివేడిగా సాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ అంశంపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. శివసేనలో ఎవరికి
మెజార్టీ ఉందో డాక్యుమెంట్ రూపంలో ఆధారాలు సమర్పించాలని ఏక్‌నాథ్ శిందేతో పాటు ఉద్ధవ్ ఠాక్రేను కూడా అడిగింది. ఆగస్టు 8వ తేదీలోగా
ఆధారాలు సబ్మిట్ చేయాలని తేల్చి చెప్పింది. ఈ అంశంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. బాలాసాహెబ్ స్థాపించిన శివసేనను కేంద్ర ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు. 56 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఇలా చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. "ఇది మహారాష్ట్ర ప్రజల్ని షాక్‌కు గురి చేసింది. బాలాసాహెబ్ ఠాక్రే 56 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించారు. ఇలాంటి పార్టీపై ఈసీ అనుమానం వ్యక్తం చేస్తోంది. కేంద్రం మా పార్టీని నాశనం చేయాలని చూస్తోంది. శివసేనకు ఒకే ఒక లీడర్ ఉన్నారు. అది ఉద్దవ్ ఠాక్రే మాత్రమే" అని స్ఫష్టం చేశారు సంజయ్ రౌత్.
మాకు మద్దతు ఉంది, శివసేన మాదే: ఏక్‌నాథ్ శిందే
అటు ఏక్‌నాథ్ శిందే కూడా స్పందించారు. "ఎన్నికల సంఘం చెప్పినట్టుగా నడుచుకుంటాం. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఆధారాలు సమర్పిస్తాం. శివసేన మాదే. మాకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పాటు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ ఉంది" అనివెల్లడించారు.