యూట్యూబ్ వల్ల తాను పరీక్షల్లో ఫెయిల్ అయ్యానంటూ భారీ పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించిన యువకుడికి షాక్ తగిలింది. పరిహారం ఇప్పటించాలని కోరిన యువకుడి పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తమ సమయం వృథా చేశారంటూ ఆ పిటిషనర్‌కు జరిమానా విధించింది. దీంతో చేసిన తప్పేంటో యువకుడికి తెలిసొచ్చింది.
అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షలకు ప్రిపేరయ్యాడు. కానీ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఉద్యోగం సాధించడంలో విఫలమయ్యాడు. అయితే తన ఓటమికి యూట్యూబ్ ను సాకుగా చూపించే ప్రయత్నం చేశాడు. తాను ఎన్నో విషయాలు నేర్చుకుందామని యూట్యూబ్ చూస్తుంటే, మధ్యమధ్యలో అశ్లీల ప్రకటనలు, అసభ్యకరమైన ప్రకటనలు వచ్చాయని కోర్టును ఆశ్రయించాడు. వీటి కారణంగా తన సమయం వృథా అయిందని, తద్వారా పరీక్షలో తాను ఉత్తీర్ణత సాధించలేకపోయానని తన దావాలో తెలిపాడు. కనుక తనకు యూట్యూబ్ నుంచి రూ.75 లక్షలు పరిహారం ఇప్పించాలంటూ కోర్టుకెక్కాడు.
చదువుకునేటప్పుడు యూట్యూబ్ లో అసభ్యకరమైన యాడ్స్ రావడంతో స్టడీస్ పై ఫోకస్ చేయలేకపోయానని, తనకు ఎలాగైనా పరిహారం ఇప్పించాలని కోరాడు. సోషల్ మీడియాలోనూ అసభ్యకరమైన ప్రకటనలు కనిపిపిన్నాయని, వాటిపై సైతం నిషేధం విధించాలని ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేయర్ అవుతున్న ఆ యువకుడు కోరాడు.
సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓక లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాజ్యాన్ని పరిశీలించింది. విచారణకు సైతం నిరాకరించిన సుప్రీం ధర్మాసనం.. ఆ యువకుడికి చీవాట్లు పెట్టింది. నీ టైమ్ వేస్ట్ చేసుకోవడంతో పాటు విలువైన కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ పిటిషనర్‌కు రూ.1 లక్ష జరిమానా విధించింది. నీకు సోషల్ మీడియాలోగానీ, యూట్యూబ్‌లో గానీ నచ్చని ప్రకటనలు వస్తే చూడవద్దని, వాటిని చూడాలా వద్దా అనేది నీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకానీ, నీలాంటి వాళ్లు పబ్లిసిటీ కోసం ప్రయోజనం లేని విషయాలపై కోర్టులను ఆశ్రయిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
విలువైన కోర్టు టైమ్ వేస్ట్ చేసే ప్రయత్నం చేసినందుకు లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని యువకుడ్ని ఆదేశించింది. అసభ్యకర యాడ్స్ వస్తే వాటిని చూడకుంటే సరిపోయేదని, ఇదంతా తన తప్పిదమేనని యువకుడు అంగకీరించాడు. తనకు ఉద్యోగం లేదని, మీరు విధించిన లక్ష రుూపాయాల భారీ జరిమానాను కట్టే స్థోమత లేదని తన వాదన వినిపించాడు పిటిషనర్. తప్పు తెలుసుకున్నానని చెప్పడంతో పాటు క్షమాపణ కోరి, తన పరిస్థితిని వివరించడంతో ధర్మాసనం అతడిపై జాలి చూపించింది. అతడికి విధించిన జరిమానాను లక్ష రూపాయల నుంచి రూ.25000 కు తగ్గించింది ధర్మాసనం.
గతంలోనూ కొందరు అనవసర విషయాలకు సైతం కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పిటిషన్లు విచారించిన కోర్టులు ఆ పిటిషనర్లకు షాకులిచ్చాయి. తాజాగా అలాంటి పిటిషన్ రావడంతో విషయం పరిశీలించిన సుప్రీం ధర్మాసనం పిటిషన్ విచారణ చేపట్టకుండానే, తమ విలువైన సమయాన్ని వృథా చేయాలని చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు జరిమానాను విధించింది.