Loepard Viral Video: నడిరోడ్డుపై ఓ చిరుతపుల్లి కూర్చొని ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రోడ్డుపై వెళ్తున్న బైకర్లు, ఇతర వాహనదారులు ఆ పులిని చూసి భయంతో వెనక్కి వెళ్లిపోతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఫ్లైఓవర్‌ను ఆనుకొని ఉన్న రోడ్డుపై చిరుత పులి దిక్కులు చూస్తూ కూర్చున్న కొన్ని సెకన్ల నిడివిగల ఆ వీడియోను కొంత మంది వ్యక్తులు వాట్సప్‌లలో షేర్ చేసుకుంటూ, ఫేస్‌బుక్, ట్విటర్‌లలో  పోస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థలు కూడా ఆ వీడియోను ప్రచురించాయి.


Claim: రాత్రి వేళ పులి రోడ్డుపై ఉన్న వీడియో అనంతపురంలో జరిగిందని, బుధవారం ఈ ఘటన జరిగిందని ప్రచారం జరుగుతోంది. రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం ఓబులాపురం గ్రామంలో జరిగినట్లుగా కొన్ని మీడియా సంస్థలు రాశాయి. ఇంకా కొంత మంది శ్రీకాకుళం జిల్లాలో అడవి నుంచి పులి జనారణ్యంలోకి వచ్చిందంటూ నకిలీ ప్రచారం జరిగింది. కర్ణాటకకు చెందిన ఓ మీడియా సంస్థ అయితే, ఆ పులి బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రోడ్డుపై కూర్చుందని రాసింది. వైరల్ అయిన ఒకే వీడియోని ఉద్దేశించి ఇలా ఎన్నో కథనాలు వచ్చాయి.


Fact Check: పులి ఇలా కనిపించడం ఏప్రిల్ 16, 2023న జరిగింది. వీడియోలో కనిపిస్తున్న జాతీయ రహదారి నెంబరు 67. కర్ణాటకలోని గడగ్ జిల్లాలో బింకదకట్టి అనే గ్రామం దగ్గర పులి కూర్చుని ఉంది. బింకదకట్టి అనే గ్రామం బెంగళూరుకు 420 కిలో మీటర్ల దూరంలో ఉంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిన ఈ వీడియో కేవలం కొన్ని సెకన్లు మాత్రమే నిలువుగా (వర్టికల్ వీడియో) ఉంది. కొన్ని కన్నడ వార్తా సంస్థలు ఏప్రిల్ 17న ఈ పులి పూర్తి వీడియోను ప్రచురించారు. అందులో ఆ పులి పక్క నుంచే ఓ లోకల్ ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఆ బస్సు నెంబరు రిజిస్ట్రేషన్ పరిశీలించగా, KA 25 అని ఉంది. ఇది కర్ణాటకలోని గడగ్ జిల్లాను సూచిస్తుంది. కాబట్టి, పులి ఉన్న ప్రాంతం గడగ్ జిల్లాగా నిర్ధారించవచ్చు. వైరల్ అవుతున్న వీడియోతో రివర్స్ సెర్చ్ చేయగా, ఒరిజినల్ వీడియో కనిపించింది.


చాలా సేపు అక్కడే ఉన్న చిరుతపులి
చిరుతపులిని చూసి దూరంగా ఆగిపోయిన వాహనదారులు తమ మొబైల్ కెమెరాల్లో వీడియోలు తీశారు. అందులో కొంతమంది ద్విచక్రవాహనదారులు పులిని చూసి జడుసుకొని వెనక్కి వెళ్తుంతుండడం స్పష్టంగా కనిపిస్తుండడం వల్ల ఆ వీడియో సాధారణంగానే అందరికీ ఆసక్తిని కలిగించింది. దానికితోడు నడి రోడ్డుపై దర్జాగా కూర్చున్న తీరు, అది తెలుగు రాష్ట్రాల్లోనే జరిగిందనే ప్రచారం జోడించేసరికి విపరీతంగా వాట్సప్ ఫార్వర్డ్‌లు సాగుతున్నాయి. కానీ, అసలు నిజం ఏంటంటే అది కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఏప్రిల్ 16న జరిగిన ఘటన. ఆ మరుసటి రోజే కర్ణాటకకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు ఆ వీడియోని ప్రచురించాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనంతపురం, శ్రీకాకుళంలో జరిగిందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.