Fire accident in Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ టపాకాయల దుకాణంలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదం జరిగిన టపాకాయల కర్మాగారం అక్రమంగా నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో దాదాపు ఏడుగురు చనిపోయారని తెలిసింది. 63 మంది తీవ్రగాయాలపాలు అయ్యారు. గాయపడిన వారు అందరినీ హార్దా జిల్లా ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్ లోని హార్దా సిటీలో ఈ పేలుడు జరగ్గా.. చుట్టుపక్కల 50 ఇళ్ల వరకూ ఆ మంటలు అంటుకున్నాయని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. గాయపడిన వారికి నాణ్యమైన చికిత్సకు అయ్యే ఖర్చును ఉచితంగా అందిస్తామని వెల్లడించింది.
పేలుడు ఘటన గురించి సమాచారం అందగానే ఫైరింజన్లు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. హుటాహుటిన భోపాల్, ఇండోర్ సహా సమీప ప్రాంతాల నుంచి ఫైరింజన్లను తెప్పించారు. అంబులెన్స్ లను కూడా తెప్పించి.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కూడా స్పందించారు. వెంటనే అక్కడికి వెళ్లాలని మంత్రి రవీంద్ర ప్రతాప్ సింగ్, డీజీ అరవింద్ కుమార్ సహా పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లాలని ఆదేశించారు. దాదాపు 400 మంది పోలీసులను ప్రమాదం జరిగిన చోట మోహరించారు. క్షతగాత్రులకు సహాయచర్యలు అందించేలా భోపాల్, ఇండోర్, ఎయిమ్స్ భోపాల్ తదితర యాజమాన్యాలకు ఆదేశాలు అందాయి.