BRS MP Venkatesh Join To Congress: బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ హైకమాండ్ రెడీ అవుతుంటే...నేతలు మాత్రం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. నిన్న మాజీ డిప్యూటీ సీఎం (Former Deputy Cm) తాడికొండ రాజయ్య (Tadikonda Rajaiah) పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా పెద్దపెల్లి (Peddapally Parliament) సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ (Venkatesh Nethakani) అనుహ్యంగా గులాబీ పార్టీకి గుడ్ చెప్పారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ మరోసారి ఇచ్చేందుకు గులాబీ బాస్ నిరాకరించడంతో వెంకటేష్ నేత పార్టీ వీడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి... ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. కేసీ వేణుగోపాల్ సమక్షంలో నేతకాని వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి ఎంపీ వెంకటేష్ తో పాటు మరో బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.
తిరిగి కాంగ్రెస్ గూటికి నేతకాని వెంకటేశ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు మారిపోతున్నాయి. మొన్నటి దాకా అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ నేతలు...పార్టీని వీడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో....నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...గులాబీ పార్టీని వీడే నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంపీ నేతకాని వెంకటేష్...2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2019లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్‌ఎస్ తరఫున ఎంపీగా గెలుపొందారు. పెద్దపల్లి సీటుపై పార్టీ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతోనే నేతకాని వెంకటేశ్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి హస్తం పార్టీ తరపున బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్...ప్రస్తుతానికి సీటుపై ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. వారితో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
రేవంత్ రెడ్డిని కలిసిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య...బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వరంగల్ ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలతో పాటు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన సభ్యులు సైతం హస్తం పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు... సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే కలిశారు. వీరంతా తమ నియోజకవర్గాల్లో సమస్యలను, పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికే కలిశామని చెబుతున్నా....సీఎంను కలవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆ తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యల గురించే అని చెబుతున్నా...బీఆర్ఎస్ ను వీడుతారంటూ ప్రచారం జరుగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలకు టచ్ వెళ్లినట్లు తెలుస్తోంది.