Google CEO Sundar Pichai Contempt Notice | ముంబై: సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌‌కి ముంబై కోర్టు షాకిచ్చింది. ఓ కేసుకు సంబంధించి సుందర్ పిచాయ్‌కు ముంబై కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ‘పఖండి బాబా కి కర్తుట్’ ‘Pakhandi Baba ki Kartut’ అనే వీడియోను తొలగించాలన్న కోర్టు ఆదేశాలను యూట్యూబ్ ఉల్లంఘించింది. యూట్యూబ్ వీడియో తొలగించకపోవడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి సోమవారం నాడు ముంబై కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది.


కోర్టు తీర్పును లెక్కచేయని యూట్యూబ్


జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ ధ్యాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యోగి అశ్వినిని లక్ష్యంగా చేసుకుని గతంలో యూట్యూబ్ లో ఓ వీడియో పోస్ట్ అయింది. ‘Pakhandi Baba ki Kartut’ అనే పేరుతో పోస్ట్ అయిన వీడియో యోగి అశ్విని పరువుకు భంగం కలిగించే వీడియో అని, దానిని తొలగించాలని ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ ముంబై కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ‘పఖండి బాబా కి కర్తుట్’ పేరుతో ధ్యాన్ ఫౌండేషన్‌ను, దాని వ్యవస్థాపకుడు యోగి అశ్వినిని టార్గెట్ చేస్తూ పోస్ట్ అయిన వీడియోను తొలగించాలని బల్లార్డ్ పీర్‌లోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నవంబర్ 21న యూట్యూబ్‌ను ఆదేశించింది.


మార్చి 31, 2024న బాంబే హైకోర్టు సూచనతో దిగువ కోర్టు గత నెలలో వీడియో తొలగించాలని నోటీసులు జారీ చేసింది. కానీ కోర్టు తీర్పును అనుసరించి వీడియో తొలగించలేదని, పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు అందుకు బాధ్యులుగా భావిస్తూ సుందర్ పిచాయ్‌కి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. 



కేసు వివరాలిలా..
ధ్యాన్ ఫౌండేషన్ ప్రతిష్టకు, సంస్థ వ్యవస్థాపకులు యోగి అశ్వినికి పరువు నష్టం కలిగించే వీడియో యూట్యూబ్ లో పోస్ట్ అయిందని ఫౌండేషన్ ఆరోపించింది. అందులో చాలా అసభ్యకరమైన అంశాలు ఉన్నాయని.. వీడియో తొలగించాలని ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. ఆ వీడియో విదేశాలలో ఇంకా అందుబాటులో ఉంది. 2023 అక్టోబర్‌లో కోర్టు ఇచ్చిన తీర్పును గూగుల్ ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని ధ్యాన్ ఫౌండేషన్ ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. గూగుల్ ఏ కారణాలు లేకున్నా కోర్టు తీర్పును ధిక్కరించిందని ఎన్జీవో తరఫు ల్యార్ రాజు గుప్తా ఆరోపించారు. 


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం కింద YouTube ప్రతిస్పందించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69-A కింద బ్లాక్ చేయగల కంటెంట్ పరువు నష్టం కిందకి రాదని వివరణ ఇచ్చింది. యూట్యూబ్ ఇచ్చిన వివరణపై కోర్టు ఏకీభవించలేదు. ఆ కేసు తదుపరి విచారణ జనవరి 3, 2025న జరగనుంది. అయితే యూట్యూబ్ ఇలాంటి ఎన్నో కేసులను గతంలో ఎదుర్కొంది. కొన్ని సందర్భాలలో కోర్టులను అనుసరించి ఒకరి పరువుకు నష్టం కలిగించేలా ఉన్న వీడియోలను తొలగించడం తెలిసిందే. కొన్ని ప్రత్యేక సందర్భాలలో కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో అది కోర్టు ధిక్కరణ వరకు వెళ్తున్నాయి.


Also Read: Jio Netflix Plans Price: రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్- ఉచితంగా "అమరన్‌, లక్కీ భాస్కర్" సహా లేటెస్ట్ సినిమాలు