One Nation One Election: జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ శనివారం తొలిసారి సమావేశమైంది. సమావేశాన్ని ఉపోద్ఘాతంగా పేర్కొంటూ, కమిటీకి ఇచ్చిన ఆదేశంపై ఎలా వెళ్లాలనే దానిపై రోడ్ మ్యాప్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఒకే దేశం - ఒకే ఎన్నికలపై లా కమిషన్, జాతీయ రాష్ట్ర పార్టీల సూచనలు కూడా ఆహ్వానించాలని ప్యానెల్ నిర్ణయించినట్లు సమాచారం.


'జమిలి ఎన్నికకు ఎదురయ్యే సమస్యలపై అభిప్రాయాలను కోరేందుకు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ నిర్ణయించింది. సూచనలు చేయడానికి లా కమిషన్ ను కూడా ప్యానెల్ ఆహ్వానించింది' అనని కమిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చీఫ్ ఎన్కే సింగ్ లు ప్యానెల్ లో సభ్యులుగా ఉన్నారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ కూడా కోవింద్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.


ఏకకాలంలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడానికి.. రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం, కొన్ని ఇతర చట్టాలు, నియమాలకు కొన్ని సవరణలను పరిశీలించి, సిఫార్సులు కూడా ప్యానెల్ చేస్తుంది. అలాగే ఎన్నికలు నిర్వహించలేని దశలు, సమయ వ్యవధిని ప్రత్యేకంగా సూచించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను సూచించడానికి ప్యానెల్ కు బాధ్యతలు అప్పగించారు. 


హంగ్ హౌజ్, అవిశ్వాస తీర్మాననం ఆమోదించడం లేదా అలాంటి ఏదైనా సంఘటన వంటి పరిస్థితులకు సాధ్యమైన పరిష్కారాలను కూడా కమిటీ సూచించాల్సి ఉంటుంది. దీని వల్ల జమిలి ఎన్నికల చక్రాన్ని కొనసాగించేందుకు అవసరమైన రక్షణలను, రాజ్యాంగానికి అవసరమైన సవరణలను సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అలాగే ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడానికి అదనపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, పేపర్-ట్రయిల్ మెషీన్లు, పోలింగ్, భద్రతా సిబ్బంది, లాజిస్టిక్స్ సౌకర్యాలను కూడా ప్యానెల్ చర్చిస్తుంది.


ముందస్తు ఎన్నికలు..? 


కేంద్రం ఒకే దేశం, ఒకే ఎన్నికపై కసరత్తు చేస్తున్న క్రమంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సంకేతాలిచ్చారు. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయం చెప్పారు. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన ఏమీ లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు. ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగే అవకాశాలు కూడా లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ గడువు ముగిసిపోయేంత వరకూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సేవ చేస్తారని వెల్లడించారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ముందస్తు ఎన్నికలు అంటూ మీడియాలో ప్రచారం జరుగుతుండటాన్ని కొట్టి పారేశారు.