Eminent Jurist Fali S Nariman Passes Away: ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ (95) (Fali S Nariman) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఢిల్లీలోని (Delhi) ఆయన స్వగృహంలో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన నారీమన్.. 22 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయవాదిగా నియమితులై ఢిల్లీ వెళ్లారు. 1972లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా నియమించింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని నిరసిస్తూ.. తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం 1991 నుంచి 2010 వరకూ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగానూ పని చేశారు. భారత న్యాయ వ్యవస్థకు నారీమన్ ను భీష్మ పితామహుడిగా పిలుస్తారు. ఆయన కుమారుల్లో ఒకరైన జస్టిస్ రొహింటన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2011 నుంచి 2013 వరకూ ఆయన కూడా సొలిసిటర్ జనరల్ గా విధులు నిర్వర్తించారు. 


ఇదీ కుటుంబ నేపథ్యం


ఫాలీ నారీమన్ 1929 జనవరి 10న మయన్మార్ లో జన్మించారు. సిమ్లా, ముంబైలో విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి ఆశయం కోసం సివిల్స్ ఎగ్జామ్స్ వైపు అడుగులేసిన ఆయన, చివరకు ఆర్థిక పరిస్థితులు సహరకరించక న్యాయవాది వృత్తి వైపు అడుగులేశారు. నారీమన్ ఓ గొప్ప రచయితగానూ గుర్తంపు పొందారు. 'బిఫోర్ ది మెమొరీ ఫేడ్స్', 'ది స్టేట్ ఆఫ్ ది నేషన్', 'ఇండియాస్ లీగల్ సిస్టమ్: కెన్ ఇట్ బి సేవ్డ్?', 'గాడ్ సేవ్ ది సుప్రీంకోర్టు' వంటి పుస్తకాలు రాశారు.


పలు అవార్డులు


అంతర్జాతీయ మధ్యవర్తిత్వంపై గుర్తింపు పొందిన న్యాయ నిపుణుడు ఫాలీ నారీమన్. న్యాయవాద వృత్తిలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అలాగే, 1999 నుంచి 2005 వరకూ ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. భారత రాజ్యాంగ చట్టం రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించడం సహా ఆయన తన కెరీర్ లో పలు కీలక కేసులను వాదించారు. గోలఖ్ నాథ్, ఎస్పీ గుప్తా, టీఎంఏ పై ఫౌండేషన్ వంటి కేసులను వాదించారు. ఇక భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో యూనియన్ కార్బైడ్ కంపెనీ తరఫున వాదించారు. అయితే అది పొరపాటని తర్వాత ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాన్ని సుప్రీంకోర్టు స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన కేసైన సుప్రీంకోర్టు ఏవోఆర్ కేసును సైతం ఈయనే వాదించారు. 2014లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత కేసులో వాదనలు వినిపించి ఆమెకు బెయిల్ ఇప్పించారు. 


నారీమన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఒక తరం ముగిసిందంటూ ఆయన మృతి పట్ల కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వంటి న్యాయ నిపుణులు సంతాపం ప్రకటించారు.


Also Read: Ban On Onion Exports : దేశంలో ఉల్లి ఎగుమతులపై కొనసాగుతున్న నిషేధం- వదంతులపై స్పందించిన కేంద్రం