Central Election Commission Press Meet: 2024 లోక్ సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లతో భారత్ చరిత్ర సృష్టించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) తెలిపింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించినట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన క్రమంలో సోమవారం సీఈసీ నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అయితే, ఎన్నికల ముగింపుపై సీఈసీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఏడు విడతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగిందని.. ఈసారి మహిళలు కీలక పాత్ర పోషించారని సీఈసీ చెప్పారు. ఈ సందర్భంగా ఓటర్లకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.






కీలక అంశాలివే


 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 


జీ7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య (64.2 కోట్లు) 1.5 రెట్లు ఎక్కువ. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే ఈ సంఖ్య 2.5 రెట్లు ఎక్కువగా ఉంది.


ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు సీఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో 1.5 కోట్ల మంది పోలింగ్, భద్రతా సిబ్బంది విధులు నిర్వహించారు. 68,763 బృందాలు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాయి. ఎన్నికల ఏర్పాట్ల కోసం 4 లక్షల వాహనాలు ఉపయోగించామని.. 135 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.


ఎన్నికల సిబ్బంది అద్భుత పని తీరుతో ఈసారి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఎక్కువగా లేదని తెలిపింది. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం రాలేదని పేర్కొంది. 2019 ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్ నిర్వహించగా.. ఈసారి 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహించాం. ఇందులో 2 రాష్ట్రాల్లోనే 25 చోట్ల రీపోలింగ్ జరిగింది.


గత 4 దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది. అక్కడ 58.58 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కశ్మీర్ లోయలో 51.05 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ అధికారులు వెల్లడించారు.


పోలీసులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంలో ముమ్మర తనిఖీల ద్వారా ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు సీఈసీ తెలిపింది. 2019లో రూ.3,500 కోట్లు స్వాధీనం చేసుకోగా.. ఈసారి రూ.10 వేల కోట్ల విలువైన నగదు, కానుకలు, డ్రగ్స్, మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు అడ్డుకున్నట్లు పేర్కొంది.


ఈ ఎన్నికల్లో సీ - విజిల్ యాప్‌లో 4.56 లక్షల ఫిర్యాదులు వచ్చాయని.. వీటిల్లో 99.9 శాతం ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపింది. డీప్ ఫేక్ వీడియోలు నిలువరించామని.. 87.5 శాతం ఫిర్యాదులకు 100 నిమిషాల లోపే పరిష్కారం చూపించినట్లు వెల్లడించింది.


అటు, మరికొద్ది గంటల్లో వెల్లడి కానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జూన్ 4న (మంగళవారం) కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ వెల్లడించింది.