Severe Road Accident In MadhyaPradesh: మధ్యప్రదేశ్‌లోని (MadhyaPradesh) రాజ్ గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 13 మంది మృతి చెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని భోపాల్ తరలించినట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని మోతీపురాకు చెందిన 30 మంది మధ్యప్రదేశ్‌లోని కులంపూర్‌లో జరిగే పెళ్లికి ట్రాక్టర్‌లో బయలుదేరగా.. రాజ్ గఢ్ జిల్లాలోని పీప్ లోడీ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఎంపీ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో రాజ్ గఢ్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రి నారాయణ్ సింగ్ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని సీఎం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. అటు, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి అధికారులు, పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని అన్నారు.


















Also Read: Bomb Threat: విస్తారా విమానానికి బాంబు బెదిరింపు, ముంబై ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటన