FIFA World Cup 2022:  తమిళనాడులోని నమక్కల్ జిల్లా నుంచి ఫిఫా ప్రపంచకప్ నకు ఆతిథ్యమిస్తున్న ఖతార్ కు రోజుకు సుమారు 2 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు కోడి గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. ఇంతకుముందు 1.5 కోట్ల గుడ్లు సరఫరా అయ్యేవి. ఫిఫా ప్రపంచకప్ జరుగుతున్నందున ఆ సంఖ్య పెరిగింది. 


నమక్కల్ జిల్లాలో సుమారు 1100 పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. వీటినుంచి రోజుకు 5.5 కోట్ల నుంచి 6 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. వాటిలో 1.5 నుంచి 1.75 గుడ్లు కేరళకు, 45 లక్షల గుడ్లు మధ్యాహ్న భోజన పథకానికి, 40 లక్షల గుడ్లు బెంగళూరుకు సరఫరా చేస్తారు. మిగిలినవి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అలానే వివిధ దేశాలకు పంపిస్తారు. 


ఖతార్ టర్కీ నుంచి గుడ్లు దిగుమతి చేసుకుంటుంది. అయితే అక్కడ ఉత్పత్తి ఖర్చులు పెరగటంతో గుడ్డు ధర కూడా పెరిగింది. నమక్కల్ నుంచి వెళ్లే ఒక గుడ్డు పెట్టె( 360 గుడ్లు) ఖతార్ కు 29 నుంచి 30 డాలర్లకు ఎగుమతి చేస్తాం. అదే టర్కీ నుంచి వచ్చే గుడ్డు పెట్టె ధర 36 డాలర్లు. కాబట్టి వారికి నమక్కల్ గుడ్లు కొనడం వల్ల 6 డాలర్లు ఆదా అవుతాయి. అందుకే మా గుడ్లకు అక్కడ డిమాండ్ ఉంది. ఖతార్ లో ఫిఫా ప్రపంచకప్ ప్రారంభమైనందున డిమాండ్ బాగా ఉంది. నమక్కల్ లో ఈ ఏడాది కోడిగుడ్ల ఉత్పత్తి కూాడా పెరిగింది. అని తమిళనాడు పౌల్ట్రీ రైతుల సంఘం అధ్యక్షుడు కె. సింగరాజ్ తెలిపారు. 


మ్యాచులు చూడడం కోసం ఇల్లు కొన్నారు


ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ మొదలైపోయింది. నిన్న ఆతిథ్య ఖతార్- ఈక్వెడార్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ ప్రపంచకప్ కోసం అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు. భారత్ లోనూ ఫిఫాకు చాలామంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం కేరళలోని ఫుట్ బాల్ ఫ్యాన్స్ చేసిన పని ఈ ఆటకు ఎంత క్రేజ్ ఉందో తెలియజేస్తోంది. ఇంతకీ వారేం చేశారో తెలుసా.


భారత్ లోని కేరళలోని ఫుట్ బాల్ అభిమానులు ఫిఫా ప్రపంచకప్ చూడడం కోసం ఏకంగా ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 17 మంది కలిసి రూ. 23 లక్షలతో ఒక ఇంటిని కొన్నారు. ఇందులో వారందరూ కలిసి మ్యాచులు చూస్తారట. కొనుగోలు చేసిన వారిలో ఒకతను మాట్లాడుతూ... ఫిఫా వరల్డ్ కప్ 2022 కోసం మేం భిన్నంగా ఏదైనా చేయాలని అనుకున్నాం. 17 మందిమి కలిసి రూ. 23 లక్షలతో ఇళ్లు కొన్నాం. దాన్ని జెండాలతో అలంకరించాం. ఇప్పుడు అందరం కలిసి ఆ ఇంట్లో పెద్ద స్క్రీన్ పై మ్యాచులు చూస్తూ ఎంజాయ్ చేస్తాం అని చెప్పారు. 


ఫిఫా ప్రపంచకప్ ముఖచిత్రం


ఫిఫా ప్రపంచకప్  29 రోజుల పాటు జరగనుంది. మొత్తం 64 మ్యాచులు జరుగుతాయి. డిసెంబర్ 18న ఫైనల్ ఉంటుంది. అరబ్ దేశంలో తొలిసారిగా ఫిఫా ప్రపంచకప్ జరగనుంది. మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి.  వీటిని 8 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 4 టీంలు ఉన్నాయి. ప్రతి టీంలోనూ టాప్ 2 లో నిలిచిన జట్టు టాప్ 16 కు అర్హత సాధిస్తుంది.