Hemant Soren ED: మనీ లాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇవాళ కూడా మరోసారి హేమంత్ సోరెన్​ను విచారించే అవకాశం ఉందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో దాదాపు 8గంటల పాటు హేమంత్ సోరెన్ ను...వివిధ కోణాల్లో ప్రశ్నించారు ఈడీ అధికారులు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత సోరెన్‌ అధికార నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు...8 గంటలకు పైగా ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ లో దాడులు జరగడంతో...ముందు జాగ్రత్తగా సీఐఎస్ ఎఫ్ బలగాలను వెంట తీసుకెళ్లారు. ఇంట్లో ప్రశ్నించే సమయంలోనూ బాడీ కెమెరాలను ఉపయోగించారు. సోరెన్‌ నివాసం చుట్టూ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసేందుకు వీలుగా కేంద్ర బృందాలు హై-రిజల్యుషన్‌ బాడీ కెమెరాలు వినియోగించాయి.


ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనపై కుట్ర చేస్తోందన్నారు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. ఈడీ దాడులకు భయపడేది లేదన్నారు. మొదట బుల్లెట్లను ఎదుర్కొనేందుకు భయపడడని... మీ మనోధైర్యాన్ని మరింత పెంచుతానంటూ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మద్దతుగా నిలిచిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాయని హేమంత్ సోరెన్ హామీ ఇచ్చారు. విల్లు, బాణాలు పట్టుకొని జేఎంఎం శ్రేణులు తరలిరావటం వల్ల సీఎం నివాసానికి వంద మీటర్ల దూరంలో పోలీసులు వారిని నిలిపివేశారు. 


అక్రమ మైనింగ్‌ వ్యవహారంతో సంబంధం ఉందంటూ సోరెన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఏడుసార్లు నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరు కాకపోవడంతో...ఈడీనే ఆయన ఇంటికి వచ్చింది. ఎనిమిదోసారి సమన్లు ఇవ్వటంతో విచారణకు అంగీకరించారు. సోరెన్ ఇంట్లోనే సుదీర్ఘంగా ప్రశ్నించారు.  గతేడాది నవంబరులో ఈడీ 9 గంటల పాటు విచారించింది. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో 14 మంది అరెస్టయ్యారు.