5 Days ED Custody to Hemant Soren in Money Laundering Case: భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను 5 రోజులు రిమాండ్ కు అప్పగిస్తూ రాంచీలోని PMLA కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం హేమంత్ ను PMLA కోర్టులో హాజరు పరిచిన ఈడీ అధికారులు, ఆయన్ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. రూ.600 కోట్లకు సంబంధించిన భూ కుంభకోణం కేసులో హేమంత్ ను విచారించాలని తెలిపింది. ఈ క్రమంలో హేమంత్ కు కోర్టు తొలుత ఒక రోజు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తీర్పును రిజర్వులో ఉంచిన న్యాయస్థానం, మరో 5 రోజులు ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నట్లు శుక్రవారం స్పష్టం చేసింది. అటు, ఝార్ఘండ్ నూతన సీఎంగా చంపై సోరెన్ (Champai Soren) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. 10 రోజుల్లోగా బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా కూడా ప్రమాణం చేశారు.


సుప్రీంకోర్టులో చుక్కెదురు


అటు, ఈ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని.. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయన్ను బుధవారం అరెస్ట్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఆయన ఝార్ఖండ్ హైకోర్టునే ఆశ్రయించారు. గురువారం ఉదయం దీనిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. అయితే, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ తదితరులు వ్యూహం మార్చి.. నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్లాలని నిర్ణయించారు. హైకోర్టులో తన పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనానికి వారు తెలిపారు. కుట్రలో భాగంగానే ఈడీ తనను అరెస్ట్ చేసిందని.. తన పదవికి రాజీనామా చేసేందుకు రాజ్ భవన్ కు వెళ్తే అక్కడ అరెస్ట్ చేయడం అన్యాయమని పిటిషన్ లో పేర్కొన్నారు. 


సోరెన్ కు మద్దతుగా దీదీ ట్వీట్





మరోవైపు, హేమంత్ సోరెన్ అరెస్టును పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. సోరెన్ శక్తిమంతమైన గిరిజన నాయకుడని.. ఆయనకు మద్దతుగా నిలుస్తానని ట్వీట్ చేశారు. 'శక్తిమంతమైన ఆదివాసీ నాయకుడైన హేమంత్ సోరెన్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. బీజేపీ మద్దతు ఉన్న కేంద్ర ఏజెన్సీల ప్రతీకార చర్య. ప్రజాభిప్రాయంతో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అణగదొక్కడానికి కుట్ర జరుగుతోంది. ఈ క్లిష్ట సమయాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి సోరెన్ పక్షాన నిలబడతానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఈ యుద్ధంలో ప్రజలు అద్భుత స్పందన అందజేస్తారు. విజయం సాధిస్తారు.' అని మమతా ట్విట్టర్ లో పేర్కొన్నారు.






'ఇండియా' కూటమి నిరసన


హేమంత్ సోరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా శుక్రవారం పార్లమెంట్ లో ప్రతిపక్షాల ఇండియా కూటమి నిరసన తెలిపింది. సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. టీఎంసీకి చెందిన ఎంపీలు కూడా పార్లమెంట్ ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని ఎంపీ డెరెక్ ఓబ్రయిన్ తెలిపారు. ఆయన అరెస్టును ఖండిస్తున్నామని చెప్పారు.


Also Read: Jharkhand CM Champai Soren: ఝార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం - 10 రోజుల్లో బల నిరూపణకు గవర్నర్ ఆదేశం