Central Government Bharat Rice: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ తక్కువ ధరలకే బియ్యం అమ్మకాలు సాగించేందుకు నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి 'భారత్ రైస్' (Bharat Rice) పేరిట కేజీ బియ్యం రూ.29లకే విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బియ్యం నిల్వలు ఎంత మేర ఉన్నాయో వివరాలు ప్రకటించాలని ట్రేడర్లను ఆదేశించింది. బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా.. గతేడాది కాలంగా బియ్యం ధరలు 15 శాతం పెరిగాయని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా (Snajeev Chopra) తెలిపారు. ఈ ధరకు రాయితీ ధరకు బియ్యం విక్రయించాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు. ఈ 'భారత్ రైస్'ను నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) సహా రిటైల్ చైన్ కేంద్రీయ భండార్ ద్వారా విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ - కామర్స్ ప్లాట్ ఫామ్స్ లోనూ ఈ రైస్ విక్రయించనున్నట్లు వెల్లడించారు.


5, 10 కేజీల ప్యాకెట్ల రూపంలో


ఈ 'భారత్ రైస్'ను వచ్చే వారం నుంచి 5 కిలోలు, 10 కిలోల ప్యాక్ ల రూపంలో అందుబాటులోకి తీసుకురానుంది. తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని రిటైల్ మార్కెట్ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కాగా, ఇప్పటికే 'భారత్ అటా' (Bharat Aata) పేరుతో గోధుమ పిండిని కిలో రూ.27.50 పైసలకు.. 'భారత్ దాల్' (Bharat Dall) పేరిట శనగపప్పును కిలో రూ.60కు కేంద్రం విక్రయిస్తోంది. అయితే, బియ్యం ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఇప్పట్లో ఎత్తివేయబోమని.. దేశీయంగా బియ్యం ధరలు తగ్గే వరకూ నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ తమ పోర్టల్స్ లో బియ్యం నిల్వలు ఎన్ని ఉన్నాయో రిటైలర్లు, హోల్ సేలర్లు, ప్రాసెసర్లు ప్రతీ శుక్రవారం తెలియజేయాలని ఆదేశించింది. బియ్యం మినహా ఇతర ఆహార పదార్థాల ధరలు అదుపులో ఉన్నాయని కేంద్రం తెలిపింది.


Also Read: Actor Vijay Political Entry: విజయ్ ఇప్పుడే ఎందుకు పార్టీ పెట్టిన్టటు? - తమిళనాడులో ఉన్న రాజకీయ పరిణామాలెలా ఉన్నాయి?