Reason Behind Actor Vijay New Political Party: తమిళనాడు విలక్షణ రాజకీయాలు ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. అప్పటి జయలలిత నుంచి నేటి తరం వరకూ ప్రముఖ నటులు రాజకీయాల్లో రాణించి ప్రజల మనసులను గెలిచారు. సీఎం పీఠాన్ని అధిరోహించి తమదైన పాలనతో ప్రత్యేక ముద్ర వేశారు. తాజాగా, తమిళ స్టార్ హీరో దళపతి రాజకీయ అరంగేట్రం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన సృష్టించింది. ఎప్పటి నుంచో ఈ ప్రచారం ఉన్నా.. 'తమిళగ వెట్రి కళగం' పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం దళపతి విజయ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు సీఎంగా.. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా ఉన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఏఐడీఎంకే ఎడప్పాడి కె.పళనిస్వామి ఉన్నారు.
జయలలిత మరణం తర్వాత
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అకాల మరణంతో అన్నాడీఎంకే దిక్కులేని పరిస్థితిని చవిచూసింది. ఆ తర్వాత పార్టీలో అంతర్గత కలహాలతో ఓ.పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళని స్వామి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. చివరకు ఓపీఎస్ కు పళని స్వామి ఉద్వాసన పలికి పైచేయి సాధించారు. ఈ క్రమంలో పన్నీర్ సెల్వం.. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తో కలిసి పని చేస్తామని ప్రకటించారు. ఇది అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించింది. శత్రువుకు శత్రువు మిత్రుడనే నానుడిని నిజం చేస్తూ బద్ద శత్రువులైన పన్నీర్ సెల్వం, దినకరన్ చేతులు కలపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. 2024 లోక్ సభ ఎన్నికల నాటికి పటిష్ట కూటమిగా ఏర్పడి.. అన్నాడీఏంకేని నిజమైన పార్టీ కార్యకర్తలకు అప్పగిస్తామని పన్నీర్ సెల్వం, దినకరన్, శశికళ త్రయం చెబుతున్నారు. పార్టీని సంరక్షించడానికే తాము కలిసి పోరాడాల్సిన అవసరం వచ్చిందనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాగా, ప్రధాన ప్రతిపక్షంలో చీలికల నేపథ్యం, స్టార్ హీరో రజినీకాంత్ పార్టీ పెడతానని చెప్పి వెనుకడుగు వేయడం వంటి కారణాలతో పార్టీ ఏర్పాటుకు ఇదే సరైన సమయమని దళపతి విజయ్ భావించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
జనం మెచ్చిన నటుడు
తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్ డమ్ ఉన్న నటుడు విజయ్. అభిమానులు 'దళపతి' అని ముద్దుగా పిలుచుకునే విజయ్.. కొంతకాలంగా చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం సహా.. తన అభిమానులకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల రజినీకాంత్ పాలిటిక్స్ లోకి రానని స్పష్టం చేయడంతో తన పార్టీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఇటీవల 'మక్కల్ ఇయక్కం' (అభిమానుల సంఘం) నిర్వాహకులతో పలుమార్లు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. 'తమిళగ మున్నేట్ర కళగం' పేరుతో పార్టీ స్థాపిస్థారని తొలుత అంతా భావించినా.. దీనికి స్వల్ప మార్పులు చేసి 'తమిళిగ వెట్రి కళగం' పేరు ఖరారు చేశారు. కాగా, తమిళ స్టార్ నటులు విజయ్ కాంత్ (డీఎండీకే), కమల్ హాసన్ (మక్కల్ నీది మయ్యమ్) సైతం కొత్త పార్టీలు స్థాపించి పాలిటిక్స్ లో అనుకున్నంత విజయం సాధించలేకపోయారు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగుతామని.. త్వరలోనే జెండా, అజెండాను ప్రకటిస్తామని విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలో దళపతి విజయ్ కొత్త పార్టీ తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.