Champai Soren Oath as a Jharkhand CM: ఝార్ఘండ్ నూతన సీఎంగా చంపై సోరెన్ (Champai Soren) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్ భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (Governor CP Radhakrishnan) ఆయనతో ప్రమాణం చేయించారు. 10 రోజుల్లోగా బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా కూడా ప్రమాణం చేశారు. కాగా, భూ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో సంకీర్ణ కూటమి తమ శాసనసభపక్ష నేతగా చంపై సోరెన్ ను ఎన్నుకుంది.
ఎవరీ చంపై సోరెన్.?
చంపై సోరెన్ 1956, నవంబరులో జిలింగోరా గ్రామంలో ఓ రైతు కుటుంబంలో జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూసోరెన్ కు విధేయుడిగా పేరొందారు. ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి 'ఝార్ఖండ్ టైగర్'గా పేరుగాంచారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో రవాణా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు ఏడుగురు పిల్లలున్నారు. కాగా, శిబుసోరెన్ తో ఆయనకు ఎలాంటి బంధుత్వం లేదు.
హైదరాబాద్ కు జేఎంఎం ఎమ్మెల్యేలు
అటు, బల నిరూపణ వరకూ జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు రానున్నారు. ప్రత్యేక విమానంలో వారంతా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అధిష్టానం ఆదేశాలతో ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపరేషన్ ఝార్ఖండ్ బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కు టీపీసీసీ అప్పగించింది. కాగా, వెనువెంటనే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేఎంఎం ఎమ్మెల్యేలంతా గురువారమే హైదరాబాద్ రావాల్సి ఉంది. జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి ముందుగా తమకు మద్దతు ఉన్న ఎమ్మెల్యేలను 2 ప్రైవేట్ విమానాల్లో హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేసింది. అయితే, రాంచీ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా అవి అక్కడే నిలిచిపోయాయి. దీంతో వారు ఇక్కడకి రాలేకపోయారు. ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం మేరకు గురువారం రాత్రికే 43 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ రావాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు కూడా చేశారు. బేగంపేట విమానాశ్రయంలో రాత్రి 10 గంటల వరకూ ఎదురుచూసి చివరకు పర్యటన రద్దు కావడం వల్ల వెనుదిరిగారు.
గవర్నర్ ఆహ్వానంతో
మనీ లాండరింగ్ కేసులో ఝార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుతో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించేలా ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని అంతకు ముందు చంపై సోరెన్ గవర్నర్ ను కోరారు. 81 మంది ఎమ్మెల్యేలున్న శాసనసభలో తనకు 48 మంది మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని చంపై సోరెన్ రెండోసారి చేసిన వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. 'చంపై సోరెన్ ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించాం. ఎప్పుడు ప్రమాణం చేస్తారో ఆయనే నిర్ణయించుకోవాలి.' అని గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నితిన్ మదన్ కులకర్ణి అన్నారు. ఈ క్రమంలో శుక్రవారం చంపై సోరెన్ ప్రమాణ స్వీకారానికి సిద్దం కాగా.. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు.