Arvind Kejriwal Skips ED Summons: మద్యం కుంభకోణానికి (Delhi Liquor Policy Case) సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఐదోసారి కూడా ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఐదుసార్లు నోటీసులు ఇవ్వగా.. ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఈడీ సమన్లు చట్ట విరుద్ధంగా ఉన్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. కాగా, ఆప్ నేతలు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే ఈడీ పదే పదే నోటీసులు ఇస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆరోపించింది. 'ఈ రోజు కూడా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కావడం లేదు. మేము చట్టబద్ధమైన సమన్లకు కట్టుబడి ఉంటాం. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం, ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడమే ప్రధాని మోదీ లక్ష్యంగా ఉంది. మేం అలా జరగనివ్వం' అని ఆప్ వెల్లడించింది.


ఇప్పటికే 4 సార్లు


ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు గత 4 నెలలుగా నాలుగుసార్లు సమన్లు జారీ చేశారు. వీటన్నింటికీ ఆయన గైర్హాజరయ్యారు. తాజాగా, జనవరి 31న కేజ్రీవాల్ కు ఐదోసారి అధికారుల నుంచి సమన్లు అందాయి. దీనిపై స్పందించిన ఆయన.. ఈ నోటీసులు చట్ట విరుద్ధమని విచారణకు గైర్హాజరయ్యారు.


బీజేపీ కార్యాలయం వద్ద నిరసనలు 






మరోవైపు, ఛండీగడ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసానికి పాల్పడిందంటూ శుక్రవారం ఆప్ నిరసన చేపట్టింది. ఆప్ నేతలు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ ఆందోళనల్లో కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ సైతం పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పారా మిలటరీ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పలు మార్గాల నుంచి వాహనాల రాకపోకలను దారి మళ్లించినట్లు వెల్లడించారు. అటు, బస్సుల్లో వస్తోన్న తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని.. తమ పార్టీ కార్యాలయం బయట పారా మిలిటరీ బలగాలను మోహరించారని ఆప్ మంత్రి అతిశీ ఆరోపించారు. మేయర్ ఎన్నికల్లో మోసం జరిగిందని.. తాము పోరాడుతుంటే బీజేపీ ఎందుకు భయపడుతోందని కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.


Also Read: Jharkhand CM: ఝార్ఖండ్ లో వీడిన రాజకీయ అనిశ్చితి - సీఎంగా చంపై సోరెన్, ఆఖరి నిమిషంలో మారిన వ్యూహాలు