CBSE 9th Class Dating Lesson: సాధారణంగా పాఠశాల విద్యార్థులకు చిన్న తనం నుంచే మంచి జీవిత చరిత్రలను, సైన్ప్ పాఠాలను తరగతితలో బోధిస్తుంటారు. దీంతో పిల్లలు చిన్నతనం నుంచే మంచి ఆలోచనలతో ప్రభావితమై భవిష్యత్తులో ఉన్నతమైన వ్యక్తులుగా ఎదుగుతుంటారు. అయితే ప్రస్తుత సమాజ పోకడలకు అనుగుణంగా పాఠ్యాంశాల రూపకల్పనకు సీబీఎస్‌ఈ శ్రీకారం చుట్టింది. ప్రధానంగా టీనేజీ విద్యార్థులకు ప్రేమ, డేటింగ్, రిలేషన్‌షిప్ వంటి విషయాలపై అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక పాఠ్యాంశాన్ని రూపొందించింది. 


సీబీఎస్‌ఈ 9వ తరగతి విద్యార్థులకు సంబంధించిన వ్యాల్యూ ఎడ్యుకేషన్‌ పుస్తకాల్లో ఈ పాఠ్యాంశాన్ని అందుబాటులో ఉంచింది. విద్యార్థులు డేటింగ్, రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చిన్న చిన్న విషయాలను చర్చించేందుకు ఈ పాఠ్యాంశాన్ని తయారు చేసింది. ఇందులో గోస్టింగ్, క్యాట్ ఫిషింగ్, సైబర్ బెదిరింపులు వంటి వాటిని వివరించేలా ఉన్నాయి. వీటితోపాటు క్రష్‌లు, ప్రత్యేక స్నేహాలు వంటి వాటిని కూడా సాధారణ కథలుగా ఉదాహరణలతో సహా వివరించారు.


సోషల్ మీడియాలో వైరల్..
సీబీఎస్‌ఈ 9వ తరగతిలో 'డేటింగ్' పాఠ్యాంశానికి సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్‌లో పంచుకోవడంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్‌గా మారింది. ఈ కాలంలో 9వ తరగతి పాఠ్యపుస్తకాలు ఇలా ఉన్నాయని.. ఆ నెటిజన్ పేర్కొన్నారు. ఈ పాఠాలను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే ప్రస్తుత కాలంలో ఇలాంటి విషయాలను వివరించేందుకు సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయంపై మరికొందరు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్ అయిన టిండర్ ఇండియా ట్విటర్‌లో స్పందించింది. ఇక తర్వాతి పాఠం బ్రేకప్‌ల గురించి ఉంటుందేమో అని పేర్కొంది. 






నెటిజన్ల స్పందన ఇలా..


➥ "ఈ పుస్తకాన్ని నాకు పంపించండి.. మొత్తం చాప్టర్‌ను నేను చదవాల్సిన అవసరం ఉంది" అని ఒకరు కామెంట్ చేశారు. 


➥ ఇక గతంలో తమకు అబ్బాయిలతో స్నేహం చేయడానికి కూడా అనుమతి లేకపోయేదని మరొక నెటిజన్ పేర్కొన్నారు. 


➥ ఇది చాలా మంచి నిర్ణయమని.. ఇంకో నెటిజన్ ట్వీట్ చేశారు. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో చిన్న పిల్లలకు ఆన్‌లైన్‌లో చాలా విషయాలు అందుబాటులో ఉంటున్నాయని.. అయితే ఇలాంటివి ప్రవేశపెట్టడం వల్ల చెత్త అంతా నేర్చుకోకుండా ఉంటుందని తెలిపారు. ఇలాంటివి మంచి భాగస్వాములను ఎంచుకునేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చివరికి మనం విష వలయాల నుంచి బయటపడ్డామని తెలిపారు.


➥ నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా గొప్ప నిర్ణయమని మరో నెటిజన్ తెలిపారు. మన విద్యావ్యవస్థలో ప్రతీ ఒక్కరు కోరుకున్న నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఇది చాలా అవసరమని మరొకరు ట్వీట్ చేశారు. టీనేజీ దశలో ప్రేమల కారణంగా సూసైడ్‌లు, డిప్రెషన్‌లోకి వెళ్లడం, మత్తు పదార్థాలకు బానిక కావడం వంటివి జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ఇలాంటి పాఠ్యాంశాలు చాలా అవసరమని పేర్కొన్నారు. 


➥ యువతకు వారి జీవితాల్లో రిలేషన్‌లను ఎలా ఎంచుకోవాలి.. వాటిని ఎలా కంట్రోల్‌ చేసుకోవాలి.. ఎలా ముందుకు నడిపించాలి అనే విషయాలను నేర్చుకునేందుకు ఇదొక సరైన విధానమని మరొకరు చెప్పారు. డేటింగ్, పెళ్లి, రిలేషన్‌షిప్, విడాకులు, లవ్, బ్రేకప్‌లు మనిషి జీవితంలో ఒక భాగాలేనని.. అవన్నీ 20 ఏళ్లకు ముందే తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...