నేషనల్ హెరాల్డ్ కేసులో తిరిగి విచారణలో చేరేందుకు శుక్రవారం హాజరు కావాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఈడీ కోరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వరుసగా మూడో రోజూ విచారించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఇంకా కొన్నింటి సమాధానం రాలేదని భావించిన ఈడీ... మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. శుక్రవారం మరోసారి విచారణకు రావాలని సమాచారం ఇచ్చింది.


ఉదయం నుంచి సుమారు 9 గంటల పాటు రాహుల్‌ను విచారించింది ఈడీ. మూడు రోజుల నుంచి దాదాపు 30 గంటలకుపైగా రాహుల్‌ను ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఇప్పటివరకు ఆయన్ని వందకుపైగా ప్రశ్నలను సంధించిందని తెలుస్తోంది. వాటికి రాహుల్‌ నుంచి సరైన సమాధానాలు రావడం లేదని.. పదేపదే తన వాంగ్మూలాన్ని మార్చుకోవడం వల్ల విచారణ ఆలస్యమైందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.






మంగళవారం ఉదయం 11 గంటలకు రాహుల్‌ ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి 11.30 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. బుధవారం కూడా ఉదయం ఈడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయన... రాత్రి తొమ్మిది గంటలకు బయటకు వచ్చారు. 


మరోవైపు రాహుల్‌పై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దిల్లీలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో ఈడీ కార్యాలయం సహా రాహుల్‌ నివాసం, కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్‌ చుట్టూ 144 సెక్షన్‌ విధించారు. అయినా సరే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు.






ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు టైర్లు కాల్చారు. మరోవైపు ఏఐసీసీ కార్యాలయంలోకి దిల్లీ పోలీసులు చొచ్చుకెళ్లి కొంతమంది నేతలను అరెస్ట్ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా రాజ్‌భవన్‌లను ముట్టడించాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.