ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తాం: మమతా బెనర్జీ
రాష్ట్రపతి ఎన్నికల వేడి దేశమంతా కనిపిస్తోంది. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టేందుకు చాలా రోజులుగా మేధోమథనం సాగిస్తున్నాయి. మొదట కాంగ్రెస్ ఈ బాధ్యతను తీసుకుని ప్రతిపక్షాలను కలుపుకుని పోయేందుకు గట్టిగానే కృషి చేసింది. అయితే పలు పార్టీలు కాంగ్రెస్ అభిప్రాయాలతో విభేదించటం వల్ల పూర్తి స్థాయిలో చర్చలు సఫలం కాలేదు. ఈ లోగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యత తీసుకున్నారు. చకచకా పావులు కదిపి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించేలా అందరూ సహకరించాలని కోరారు. దాదాపు నాలుగు రోజుల చర్చల తరవాత
మమతా బెనర్జీ ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు తీర్మానం కూడా చేశామని స్పష్టం చేశారు దీదీ. "మేం ఎన్నుకునే అభ్యర్థికి అందరమూ మద్దతునివ్వాలని నిర్ణయించాం. ఎన్నో నెలలుగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తాం" అని అన్నారు మమతా బెనర్జీ. దీదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అభ్యర్థి విషయంలో ఇంకా రాని స్పష్టత
ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్‌ను నిలబెట్టాలని ప్రతిపాదించారని, అయితే ఆయన ఆరోగ్య సమస్యల రీత్యా ఆలోచించాల్సి వస్తోందని అన్నారు సీపీఐ నేత బినోయ్ విశ్వం. అయితే ప్రతిపక్షాలు మాత్రం కచ్చితంగా శరద్ పవార్‌నే అభ్యర్థిగా ప్రకటించాలని పట్టు పడుతున్నట్టు సమాచారం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రధాని మోదీ భంగం కలిగిస్తున్నారని, ఆయనను అడ్డుకోవాలంటే
బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నామని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఫరూక్ అబ్దుల్లాతో పాటు గాంధీ మనవడు గోపాల కృష్ణ గాంధీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీ వీరిద్దరి పేర్లనూ ప్రతిపాదించినట్టు సమాచారం. మమతా బెనర్జీ లేఖలు పంపిన నేతల జాబితాలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. భాజపా హయాంలో ప్రాధాన్యత దక్కని వర్గాల వారి వాణిని వినిపించటమే చర్చల ప్రధాన ఎజెండా అని అప్పుడే దీదీ స్పష్టంగా లేఖలో ప్రస్తావించారు. నిజానికి కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల విషయమై చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని ప్రకటించేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ విషయమై చాన్నాళ్లుగా ఇతర పార్టీలతో చర్చలు జరుపుతోంది. అయితే కాంగ్రెస్ కన్నా ముందుగానే ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే విషయంలో కీలక పాత్ర పోషించాలని భావించారు పశ్చిమ బంగ సీఎం మమత బెనర్జీ. అందుకే ఆ బాధ్యత తీసుకున్నారు. అయితే ఈ సమావేశానికి ఆప్‌తో పాటు తెరాస హాజరు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది.