ECI Reschedules Haryana Voting Date | చండీగఢ్: భారత ఎన్నికల సంఘం హర్యానా ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాలో అక్టోబర్ 1న జరగాల్సిన ఎన్నికలను 5వ తేదీకి వాయిదా మార్చారు. ఎన్నికల తేదీ వాయిదా పడటంతో జమ్మూ కాశ్మీర్ తో పాటే హర్యానాలోనూ ఓట్ల లెక్కింపును అక్టోబర్ 4 నుంచి 8వ తేదీకి మార్చుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.


బిష్ణోయ్ సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి వచ్చిన వినతి మేరకు ఎలక్షన్ కమిషన్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ మూలపురుషుడు గురు జంబేశ్వర్‌ స్మారకంగా బిష్ణోయ్ తెగవారు అసోజ్‌ అమవాస్య పండగను ప్రతి ఏడాది నిర్వహిస్తారు. అక్టోబర్ 2న అసోజ్‌ అమవాస్య వేడుకలో హర్యానాతో పాటు రాజస్థాన్, పంజాబ్ కు చెందిన ఈ కమ్యూనిటీ వారు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు భారీ ఎత్తున బిష్ణోవ్ కమ్యూనిటీ వారు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కోల్పోతామని ఎన్నికల సంఘాన్ని కోరారు. వీరి సంప్రదాయం, సంస్కృతిని గౌరవించాలని.. బిష్ణోయ్ కమ్యూనిటీ వినతికి ఈసీ ఓకే చెబుతూ హర్యానాలో ఎన్నికలను అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5కు వాయిదా వేశారు.


హర్యానా ఎన్నికలకు, జమ్మూకాశ్మీర్ మూడో ఫేజ్ ఎలక్షన్లకు సెప్టెంబర్ 5న గెజిట్ నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ వేసేందుకు తుది గడువు సెప్టెంబర్ 12తో ముగుస్తుంది. నామినేషన్లను సెప్టెంబర్ 13న పరిశీలిస్తారు. నామినేషన్ ఉపసంహరణ గడువు సెప్టెంబర్ 16న హర్యానాలో, 17న జమ్మూకాశ్మీర్ లో ముగియనున్నట్లు ఈసీ పేర్కొంది. అక్టోబర్ 5న హర్యానాలో ఎన్నికలు కాగా, అక్టోబర్ 1వ తేదీన జమ్మూకాశ్మీర్ లో మూడో ఫేజ్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిపి అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.






హర్యానాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 90 కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాలు నెగ్గింది. దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వం వహించిన జననాయక జనతా పార్టీతో పొత్తుతో బీజేపీ అధికారం చేపట్టింది. మరోసారి నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుండగా, ఈసారి ఎలాగైనా తామే విజయం సాధిస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు దీమాగా ఉన్నారు. 


Also Read: Youngest Billionaires : ఇరవై ఏళ్లకే బిలియనీర్లయిపోయారు - తాత, ముత్తాతల ఆస్తితో కాదు - Zepto ఫౌండర్ల కథ ఇదే