EAM S Jaishankar: చైనాతో ఇండియాకు కొన్ని చోట్ల సరిహద్దు సమస్యలున్నాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ మంగళవారం లోక్ సభలో తెలిపారు. నిజానికి ఇరుదేశాల మధ్య వాస్తవ సరిహద్దు రేఖ (ఎల్ఏసీ) ఉందని, అయితే కొన్ని చోట్ల ఈ రేఖకు సంబంధించి ప్రాంతాలపై అభిప్రాయ బేధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక చర్చల ద్వారానే సరిహద్దు కు సంబంధించిన అంశాలను పరిష్కారం చేసుకుంటామని వెల్లడించారు.
ఎల్ఏసీలో కొన్ని ప్రాంతాల సరిహద్దుకు సంబంధించి ఇరుపక్షాలలో కామన్ అవగాహన లేదని పేర్కొన్నారు. ఈక్రమంలో చైనాతో చర్చల ద్వారా దీనిపై పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. మరోవైపు సరిహద్దులో శాంతి, స్థిరత్వం లేకుండా రెండు దేశాల మధ్య రిలేషన్ష్ సాధారణంగా ఉండలేవని చైనాకు చెప్పినట్లు జై శంకర్ పునరుద్ఘాటించారు. వీటికి సంబంధించి తమకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉందని, న్యాయపరమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఆ దేశంతో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
అక్సాయ్ చిన్ ఆక్రమణ..
1962 యుద్ధం ముగిశాక లడఖ్ ప్రాంతంలోని అక్సాయ్ చిన్ లోని 38 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని వివరించారు. , ఇక మరో 5180 చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించిన దాయాది పాకిస్తాన్.. ఈ ప్రాంతాన్ని చైనాకు ధారదత్తం చేసిందని విదేశాంగ మంత్రి జై శంకర్ ఆరోపించారు.
2020లో మన ఆర్మీ గొప్పగా పోరాడింది..
ఇక 2020లో తూర్పు లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో చైనా దళాలు ఆక్రమణకు పూనుకోగా, మన సైనిక దళాలు సమర్థంగా తిప్పికొట్టాయని జై శంకర్ ప్రశంసించారు. ఆ సమయంలో సవాలుతో కూడుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ సైన్యం గొప్పగా పోరాడిందన్నారు. అప్పటికే కోవిడ్ 19 ఒకవైపు, లాజిస్టిక్ సమస్యలు మరోవైపు ఇబ్బంది పెట్టినా మన సైనిక దళాలు ఏమాత్రం వెనుకంజ వేయకుండా, ప్రత్యర్థి దళాల దాడులను సమర్థంగా తిప్పికొట్టాయని కొనియాడారు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కృషితో..
మరోవైపు చైనాతో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ జరిపిన సంప్రదింపులు కూడా ఫలప్రదమయ్యాయని జై శంకర్ కొనియాడారు. చైనా రక్షణ మంత్రి డోంగ్ జున్ తో లావోస్ లో జరిగిన 11వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశంలో రాజనాథ్ సింగ్ చర్చించారు. ఆ చర్చల తర్వాత వివాదస్పద సరిహద్దు వద్ద రక్షణ దళాలను వెనక్కి రప్పించాలని తీర్మాణించాయి. దీంతో 2020కి ముందున్నట్లుగానే ప్రస్తుత పరిస్థితి నెలకొంది.
ఇరుదేశాల సంయక్త పహారా..
తూర్పు లడఖ్ లోని డెంచోక్, డెస్పాంగ్ ప్రాంతాలలో వారానిక ఒకసారి రెండు దేశాలకు చెందిన సైన్యం కలిసి పహారా కాయాలని నవంబర్ లో ఒక అవగాహనకు వచ్చాయి. ఈ క్రమంలో నవంబరులో ఉమ్మడిగా ఈ కార్యక్రమాలు నిర్వహించాయి. అనంతరం వారానికి ఒకసారి ఒక్కో దేశానికి చెందని సైనిక దళం పహారా కాయాలనే నిర్ణయానికి వచ్చాయి. రెండు దేశాలకు సంబంధించి పలు మంత్రిత్వ శాఖలు పలు దఫాలుగా చర్చలు జరపడంతో ప్రస్తుతానికి శాంతియుత వాతావరణం నెలకొంది.