Summer Trips: ఈ సమ్మర్‌లో చల్లగా ఛిల్ అయ్యేందుకు ఊటీ, కొడైకెనాల్ వంటి హిల్ స్టేషన్లకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా..? మీ సొంత వెహికిల్ లో ఫ్యామిలీతో  కొండ బాటల వంపు సొంపులను ఎంజాయ్ చేస్తూ వెళ్లి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా? ఆగండాగండి.. ముందు  ఈ పాస్ తీసుకున్నారా..? 


పిల్లలకు వేసవి కాలం సెలవలిచ్చారు కనుక  మనం కూడా ఒక  వారం పాటు సెలవ పెడితే.. ఎక్కడికైనా టూర్ కి వెళ్లి రావచ్చు అనుకుంటారు ఎవరైనా. మండు వేసవిలో టూర్ అంటే ఠక్కున గుర్తొచ్చేవి ఊటీ, కొడైకెనాల్ వంటి కొండ ప్రదేశాలు. వేసవిలో చల్లగా ఛిల్ అయ్యేందుకు దక్షిణ భారతదేశంలో వీటికి మించిన గొప్ప పర్యాటక ప్రాంతాలు లేవు.  కానీ ఈ సారి ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి చేసింది తమిళనాడు ప్రభుత్వం. 


ఈ పాస్ తప్పనిసరి


తమిళనాడులోని నీలగిరి కొండల మీద ఉన్న ఊటీకి వెళ్లాలన్నా.. దానికి దాదాపు 250 కిలీమీటర్ల దూరంలో పశ్చిమ కనుమల్లో ఉన్న కొడైకెనాల్‌కి వెళ్లాలన్నామే 6 నుంచి జూన్ 30 వరకు తాము మంజూరు చేసే ఈ పాస్ తీసుకోవడం తప్పనిసరి అని తమిళనాడు ప్రభుత్వం నిర్దేశించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది.  


ఈ పాస్ ఎవరెవరు తీసుకోవాలి. 


ఊటీ. కొడైకెనాల్ తో సహా నీలగిరి కొండలపైనకి తమ సొంత వాహనాలపై ఈ వేసవి కాలంలో (మే 6 నుంచి జూన్ 30) వరకువచ్చే టూరిస్టులందరికీ ఈపాస్‌లు తప్పనిసరిగా ఉండాలి.  స్థానికులకు, బస్సులు, రైళ్లు వంటి ప్రభుత్వ రవాణా ద్వారా ఈ ప్రాంతాలకు వచ్చే వారికి వీటి అవసరం లేదు.  స్థానికులై ఉండి వాహనాలపై తిరిగే వారైతే.. వాహన రిజిస్ట్రేషన్ నంబరులో ‘టీ ఎన్ 43’ ఉంటే’ ఇబ్బంది లేకుండా తిరగొచ్చు. అలా కాకుండా బయట వాహనాలు కొనుక్కున్న స్థానికులైతే ఒక్కసారి ప్రభుత్వ అధికారుల అనుమతి పొంది ఆ తరువాత యధేచ్చగా తిరగొచ్చు. 


ఈ పాస్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?  


మే ఆరు నుంచి జూన్ 30 లోపు ఊటీ, కొడై కెనాల్ వంటి హిల్ స్టేషన్లకు వెళ్లే వాళ్లు.. ప్రభుత్వం నిర్దేశించిన ఈ ఈ-పాప్ తీసుకునేందుకు ప్రభుత్వ వెబ్ సైట్ epass.tnega.org లో తమ వివరాలు నమోదు చేయాలి. ఎంతమంది వెళ్తన్నారు, వాహనం వివరాలు, ఎప్పుడొస్తారు, ఎప్పుడెళ్తారు, ఎందుకొస్తున్నారు, ఎక్కడ బస చేయబోతున్నారు,  వారి అడ్రస్ వంటి వివరాలు ఇందులో ఇవ్వాలి.  ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక.. ఈ పాస్ ఒక క్యూఆర్ కోడ్ ‌తో మంజూరవుతుంది. దీన్ని ఆయా హిల్ స్టషన్ల ఎంట్రీ పాయింట్లలో స్కాన్ చేయడం ద్వారా చెక్ చేస్తారు.  


అసలెందుకు ఈ ఈ -పాస్


ఊటీ కొడై కెనాల్ వెళ్లేందుకు ఈ ఈపాస్ తప్పనిసరిగా తీసుకోవడం అనేది ఆంక్షలు విధించేందుకు తీసుకున్న నిర్ణయం కాదు.  వేసవిలో జనం తాకిడి ఎక్కువ ఉండే అవకాశం ఉండటంతో వారికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా ఉంటుందని మద్రాస్ హైకోర్టు మే 6 నుంచి జూన్ 30 వరకు మాత్రమే వాహనాలను రెగ్యులేట్ చేయాల్సిందిగా ఆదేశించింది.   దీని ద్వారా ఎన్ని వాహనాలు ఆయా ప్రాంతాల్లోకి ఎంటరయ్యాయో, ఎంత మంది వచ్చారో, ఎన్ని రోజులు ఉంటారో తెలుస్తుంది కనుక ఆ వివరాలతో వాళ్లకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఉంచేందుకు వీలుంటుందనేది దీని వెనకున్న ఉద్దేశం.