అకస్మాత్తుగా ఏదైనా సుదూర ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం వస్తే ఎవరైనా తీసుకునే మొదటి ఆప్షన్ రైలు ప్రయాణమే. ఎందుకంటే ఇదే చాలా సౌలభ్యంగా, సుఖంగా మనల్ని గమ్యానికి చేరుస్తుంది. పైగా ఇతర అన్ని ప్రయాణాలతో పోలిస్తే రైలు ప్రయాణం చాలా చవకైనది. ఒక స్లీపర్ క్లాస్ టికెట్..  కచ్చితంగా ఒక  సాధారణ బస్సు టికెట్ కంటే తక్కువ రేటుకే దొరుకుతుంది.


టికెట్ చిక్కకపోవడమే అసలైన చిక్కు.. 


అన్ని రకాలా అనువుగా ఉండే ఈ రైలు ప్రయాణాలతో వచ్చిన  చిక్కేంటంటే నూటికి 70 మంది ఎంచుకునే ఈ రైలు ప్రయాణాల్లో.. సీటు కోసం ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. జనరల్ టికెట్ తీసుకుంటే ఎలాగో సీటు దొరకదు అనుకోండి.. స్లీపర్ క్లాస్, 3 ఏసీ, 2 ఏసీ, ఫస్ట్ క్లాస్ వంటి వాటికి టికెట్లు దొరకాలన్నా.. కొన్ని వారాల ముందే రిజర్వ్ చేసుకోవాలి. కొన్ని పర్యాటక ప్రాంతాలకు కొన్ని నెలల ముందు చూసినా వెయిటింగ్ లిస్టు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. అర్జంటుగా ఊరికి వెళ్లాలనుకునే వాళ్ళు అప్పటికప్పుడు రైలు ప్రయాణం ఎలా చేస్తారు..?


వెయిటింగ్ లిస్టుతో తంటా..


అర్జెంటుగా ఊరికి వెళ్ళాలా..? ట్రైన్ టికెట్ బుక్ చేసినా.. అది కన్ఫామ్ కాలేదా..? వెయిటింగ్ లిస్టులో ఉందా..? ఇలా అందరికీ తరచూ జరుగుతూనే ఉంటుంది.  ఊరికి వెళ్లాలని ట్రైన్ టికెట్ బుక్ చేయడం.. అది కన్ఫామ్ కాకపోవడం..  తత్కాల్ ట్రై చేయడం.. అది కూడా ఫైనల్ అవ్వక పోవడం..వంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్‌ను కన్ఫర్మ్ టికెట్ గా మార్చుకోవడానికి ఒక సీక్రెట్ ట్రిక్ ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.


ఒక్కటి కాదు ఏడు ట్రైన్లలో..


'ఐ ఆర్ సి టి సి రైలు కనెక్ట్' అప్లికేషన్ ఓపెన్ చేయండి. 'మై బుకింగ్ ' లోకి వెళ్లి.. వెయిటింగ్ లిస్టు లో ఉన్న మీ టికెట్ సెలెక్ట్ చేసి... దాని పైన కనిపించే త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ 'ఆప్ట్ ఫర్ వికల్ప్' అనే అప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. అంతే.. ఇప్పుడు మీకు అవైలబుల్ లో ఉన్న ట్రైన్స్ లిస్టు కనిపిస్తుంది. ఏంటీ లిస్టు అంటారా.. అంటే.. మనం టికెట్ బుక్ చేసుకున్న ట్రైన్ లో సీట్లు అన్నీ అయిపోయి ఉండొచ్చు. మనకి వెయిటింగ్ లిస్టు వచ్చి ఉండొచ్చు. కానీ మనం వెళ్లే స్టేషన్‌ నుంచి గానీ దగ్గర్లో ఉన్న స్టేషన్ల నుంచి గానీ.. మనం వెళ్లాలనుకున్న సమయానికి, తరువాతి మూడు రోజులకి అందుబాటులో ఉన్న రైళ్ల లిస్టే అది. అందులోంచి అత్యధికంగా ఏడు రైళ్లని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు సెలెక్ట్ చేసిన రైళ్లలో చార్ట్ ప్రిపేర్ అయ్యే  సమయానికి ఎక్కడ వేకెన్సీ ఉన్నా మీకు కన్ఫామ్ గా టికెట్ దొరుకుతుంది. ఒకవేళ మీరు మొదట బుక్ చేసింది స్లీపర్ కోచ్ అనుకుంటే.. మీరు ఎంచుకున్న ఏడు రైళ్లలో ఆ క్లాస్ అందుబాటులో లేకుంటే అంతకు మించిన క్లాస్‌లో టికెట్‌కు మిమ్మల్ని అప్గ్రేడ్ చేస్తారు.  అది కూడా ఎలాంటి చార్జీలు లేకుండా.  ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరూ ఈ అవకాశాన్ని ఈసారి వాడుకోండి. మీ బ్యాచ్ లో ఎవరైనా ట్రైన్ బుకింగ్స్ కోసం ఇబ్బంది పడుతుంటే.. వాళ్ళకి ఈ సమాచారం షేర్ చేయండి.