Mathura Rail Mishap: 


మధుర జంక్షన్ వద్ద ఘటన..


మధుర జంక్షన్ వద్ద ఓ ట్రైన్ ఉన్నట్టుండి ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కడం సంచలనమైంది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడింది. అప్పటి వరకూ అక్కడే ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమైందో అర్థం కాలేదు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన రైల్వే అసలు విషయం వెల్లడించింది. ఇంజిన్‌ క్యాబ్‌లో ఆపరేటర్ చేసిన ఓ చిన్న తప్పిదమే అందుకు కారణమని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా విడుదల చేసింది. రైల్ ఇంజిన్‌ని ఆన్, ఆఫ్ చేసే Throttle అనుకోకుండా ప్రెస్ అవడం వల్ల ట్రైన్‌ ముందుకి కదిలింది. ప్లాట్‌ఫామ్‌కి దూసుకుపోయింది. ఇది జరగడానికి అసలు కారణం...ఆ ఆపరేటర్‌ మొబైల్‌లో మునిగిపోవడమే. ఇంజిన్ క్యాబ్‌లోని సీసీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది. రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...లోకోపైలట్‌ తన డ్యూటీ ముగించుకుని ట్రైన్ దిగిన వెంటనే ఆపరేటర్ సచిన్ క్యాబిన్‌లోకి వచ్చాడు. మొబైల్ చూస్తూనే ఎక్కాడు. ఆ ఫోన్‌లో మునిగిపోయి తన బ్యాక్‌ప్యాక్‌ని ఎక్కడ పెడుతున్నాడో కూడా చూసుకోలేదు. నేరుగా ఇంజిన్ Throttle పై పెట్టాడు. మొబైల్ పక్కన పెట్టుకుని వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఆ బ్యాగ్ బరువుకి ఆ థ్రాటిల్‌ ప్రెస్ అయింది. వెంటనే రైలు ముందుకు దూసుకుపోయింది. అలా ప్లాట్‌ఫామ్‌కి ఎక్కింది. 


కెమెరాలో రికార్డ్..


కెమెరాలో ఇదంతా రికార్డ్ అయిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు  బాధ్యులైన లోకోపైలట్‌, టెక్నికల్ స్టాఫ్‌తో పాటు మొత్తం 5గురిని సస్పెండ్ చేశారు. మరో సంచలన విషయం ఏంటంటే...ఈ ఐదుగురు ఆ ఘటన జరిగిన సమయానికి మద్యం మత్తులో ఉన్నారు. అందుకే వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని తెలిపారు. అయితే...ఆపరేటర్ సచిన్ మాత్రం రైలు దానంతట అదే ముందుకి వెళ్లిపోయిందని చెబుతున్నాడు. ఎమర్జెన్సీ బ్రేక్ వేసినప్పటికీ అది ఆగలేదని వివరించాడు. ఆ తరవాతే Throttle ఆన్‌లో ఉందని తెలుసుకున్నట్టు అధికారులకు చెప్పాడు. లోకోపైలట్‌ ట్రైన్‌ ఇంజిన్‌ని ఆన్‌లో ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించాడు. కానీ...లోకోపైలట్ మాత్రం తాను తాళాలను ఆపరేటర్‌కే ఇచ్చానని చెబుతున్నాడు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 


రెండు నెలల క్రితం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో LPG లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ వ్యాగన్‌లు అదుపు తప్పాయి. అప్పటికే బాలాసోర్ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. అలాంటి సమయంలో ఈ ఘటన జరగటం అలజడి సృష్టించింది. రెండు వ్యాగన్‌లు కిందపడిపోయాయి. అన్‌లోడింగ్ చేసే సమయంలో వ్యాగన్‌లు కింద పడిపోయినట్టు అధికారులు వెల్లడించారు. 


"రాత్రి పూట లోడ్ వచ్చింది. అన్‌లోడ్ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి రెండు వ్యాగన్‌లు అదుపు తప్పి కింద పడిపోయాయి. ఈ ఘటనతో ఇతర రైళ్లకు ఎలాంటి అంతరాయం కలగలేదు. ఉదయం కాగానే అంతా క్లియర్ చేశాం. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. భారత్ పెట్రోలియం మెయిన్ గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది"


- అధికారులు 


Also Read: భారత్‌కి తొలి ప్రధాని నెహ్రూ కాదు సుభాష్ చంద్రబోస్ - బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు