Sanatana Dharma Row: తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై వివాదం, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అన్ని వర్గాల వారి నుంచి విమర్శలు వస్తున్నా.. ఆయన మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం కానీ, క్షమాపణ చెప్పడం కానీ చేయడం లేదు. తాజాగా ఉదయనిధి స్టాలిన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఫోటోను పోస్టు చేశారు. ఈ వివాదం నడుస్తున్న వేళ ఆయన అలాంటి ఫోటోను పోస్టు చేయడం చూస్తుంటే.. తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదు అనే సందేశాన్ని పంపించినట్లు తెలుస్తోంది.
సనాతన ధర్మాన్ని గతంలో డెంగ్యూ, మలేరియా, దోమలు లాంటి వాటితో పోలుస్తూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ (X) లో మస్కిటో కాయిల్ ఫోటోను పోస్టు చేశారు ఉదయనిధి స్టాలిన్. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. దీంతో పరోక్షంగా మరోసారి వివాదాన్ని పెంచుతున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు. డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలను వ్యాపింపజేసే దోమలను తరిమికొట్టడానికి మస్కిటో కాయిల్స్ వాడుతుంటారు. ఆయన ఆ ఫోటో పెట్టడాన్ని చూస్తుంటే.. మరోసారి అవే వ్యాఖ్యలను పరోక్షంగా చేసినట్లు అనుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బీజేపీని విషసర్పంతో పోల్చిన ఉదయనిధి
బీజేపీ ఓ విషసర్పం అని సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మండి పడ్డారు. DMK ఎమ్మెల్యే ఇంట్లో పెళ్లికి వెళ్లిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షమైన AIDMK పైనా విమర్శలు చేశారు. AIDMK పార్టీ చెత్తలాంటిదైతే.. అందులోని పాము బీజేపీ అని సెటైర్లు వేశారు. ఇప్పటికే డీఎమ్‌కే ఎంపీ ఎ. రాజా ఇలాంటి వ్యాఖ్యలే చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీయే విషసర్పం అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ బీజేపీని విషసర్పంతో పోల్చారు.
"ఓ విషసర్పం మీ ఇంట్లోకి వచ్చినప్పుడు కేవలం దాన్ని పట్టుకుని బయటకు వదలడం మంచిది కాదు. మళ్లీ అది ఏదో ఓ మూల నుంచి ఇంట్లోకి వచ్చి నక్కి ఉంటుంది. మీ ఇంట్లో చెత్తను శుభ్రం చేసుకోనంత వరకూ అది అక్కడే ఉంటుంది. ఇదే ఉదాహరణను తమిళనాడు పరిస్థితులతో పోల్చి చెబుతున్నాను. తమిళనాడు మన ఇల్లు లాంటిది. ఇక్కడ AIDMK చెత్త కుప్ప అయితే.. బీజేపీ విషసర్పం. ఆ చెత్తను తొలగిస్తే తప్ప ఆ పాము అక్కడి నుంచి వెళ్లిపోదు. బీజేపీ నుంచి విముక్తి కలగాలంటే AIDMKనీ తుడిచి పెట్టేయాలి" అని ఉదయనిధి వ్యాఖ్యానించారు.
డీఎమ్‌కే నేతలందరినీ ఉద్దేశించి ఇప్పటికే ఓ నోట్ విడుదల చేశారు ఉదయనిధి స్టాలిన్. అనవసరంగా ఈ వివాదాన్ని పట్టించుకుని టైమ్ వేస్ట్ చేసుకోవద్దని సూచించారు. తనపై విమర్శలు చేసిన వాళ్లపై కేసులు పెట్టడం, వాళ్ల దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం లాంటివి చేయొద్దని వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీ, పళనిస్వామి సహా అయోధ్యకు చెందిన సాధువు మహంత్ పరమహన్స్‌పైనా విమర్శలు చేశారు.