G20 Dinner: 


దీదీపై అధిర్ రంజన్ అసహనం..


కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మండి పడ్డారు. G20 సమ్మిట్‌లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులందరికీ విందు ఇచ్చారు. ఈ డిన్నర్‌కి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందించారు. అందులో మమతా బెనర్జీ కూడా ఉన్నారు. అయితే...కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని పిలవకపోవడంపై ఆ పార్టీ గుర్రుగా ఉంది. ఖర్గేని పిలవని డిన్నర్‌కి మమతా ఎందుకు వెళ్లారంటూ అధిర్ రంజన్ అసహనం వ్యక్తం చేశారు. ఆమె ఆ విందుకి హాజరై ప్రధాని మోదీ ముందు లోకువైపోయారని విమర్శించారు. ఆమె వెళ్లకపోయినా వచ్చే నష్టమేమీ లేదని తేల్చి చెప్పారు. 


"రాష్ట్రపతి విందుకి ఆమె హాజరు కాకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. ఆకాశం విరిగి కింద పడిపోదుగా. మహాభారతం, ఖురాన్ అపవిత్రం అయిపోతాయా..? ఆమె ఈ విందులో పాల్గొనడానికి వేరే ఏమైనా కారణం ఉందేమో అని అనుమానంగా ఉంది. డిన్నర్‌లో ఆమె యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రహోం మంత్రి అమిత్‌షా పక్కనే కనిపించారు. బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు డిన్నర్‌కి వెళ్లలేదు. కానీ మమతా బెనర్జీ మాత్రం చాలా హడావుడిగా వెళ్లిపోయారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి ఆహ్వానం అందకపోయినా ఆమె వెళ్లడం వెనక ఉద్దేశమేంటి..?"


- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ


టీఎమ్‌సీ కౌంటర్ 


దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సంతను సేన్ స్పందించారు. కొన్ని ప్రోటోకాల్స్‌కి అనుగుణంగా సీఎం పర్యటించాల్సి ఉంటుందని, అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని మందలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి G20 డిన్నర్‌కి ఎప్పుడు హాజరవ్వాలో అధిర్ రంజన్ చెప్పాల్సిన పని లేదని, ప్రోటోకాల్ ప్రకారమే ఆమె వెళ్లారని తేల్చి చెప్పారు. 


G20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులందరికీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. కానీ...కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి మాత్రం ఈ ఆహ్వానం అందలేదు. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు. కొందరైతే "కుల రాజకీయాలు" అంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం స్పందించారు. ఖర్గేని ఆహ్వానించకపోవడంపై మండి పడ్డారు. ప్రజాస్వామ్యం,ప్రతిపక్షం లేని దేశాల్లో తప్ప ఇలా ఎక్కడా జరగదని విమర్శించారు. ఇంకా భారత్‌ ఇలాంటి దశకు చేరుకోలేదనే అనుకుంటున్నాని అసహనం వ్యక్తం చేశారు చిదంబరం. ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఖర్గేకి ఆహ్వానం అందకపోవడంపై స్పందించారు. ప్రతిపక్ష నేతలంటే ప్రధాని మోదీకి ఏ మాత్రం లక్ష్యం లేదని మండి పడ్డారు. ఈ వివాదంపై స్వయంగా ఖర్గే కూడా స్పందించారు. ఇప్పటికే పార్టీ తరపున చాలా మంది ఈ విషయంపై మాట్లాడారని, ఇలాంటి రాజకీయాలు పనికి రావని విమర్శించారు. 


"ప్రధాన ప్రతిపక్ష నేతను రాష్ట్రపతి విందుకి ఆహ్వానించకపోవడం బహుశా మరే దేశంలోనూ జరగదేమో. ప్రతిపక్షం, ప్రజాస్వామ్యం లేని దేశాల్లోనే ఇలా జరుగుతుంది. ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనే స్థాయికి భారత్ ఇంకా దిగజారిపోలేదనే అనుకుంటున్నాను"


- పి చిదంబరం, కాంగ్రెస్ ఎంపీ 


Also Read: Vladimir Putin: జీవితకాలం పుతినే అధ్యక్షుడు? పోటీదారులెవరూ లేరంటున్న క్రెమ్లిన్