Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటే ఆయనతో ఎవరూ పోటీ చేయలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు పుతిన్ ఇంకా నామినేట్ ప్రకటించలేదని.. కానీ అధ్యక్ష అభ్యర్థిగా నిలబడితే మాత్రం ఆయనకు ఎలాంటి పోటీ ఉండదని స్పష్టంగా తెలుస్తున్నట్లు డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. వ్లాదిమిర్ పుతిన్ కు రష్యా జనాభా పూర్తి మద్దతు ఉన్నట్లు తెలిపారు. 


మాజీ కేజీబీ ఏజెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ రెండు దశాబ్దాలకు పైగా రష్యా అత్యున్నత పదవిలో ఉన్నారు. 1962 క్యూబన్ క్షిపణి సంక్షోభం తర్వాత పశ్చిమ దేశాలతో తీవ్ర ఘర్షణ కూడా సంక్షోభానికి దారి తీసింది. ప్రస్తుతం రష్యాకు ఉక్రెయిన్ కు మధ్య జరుగుతున్న యుద్ధం కూడా పుతిన్ కు సవాల్ గా మారింది. రష్యా అధ్యక్షుడి ప్రణాళిక ప్రకారం ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా.. వాగ్నర్ మిలిటరీ గ్రూప్ చీఫ్ అయిన ప్రిగోజిన్ నుంచి చిన్నపాటి తిరుగుబాటును కూడా పుతిన్ ఎదుర్కొన్నాడు. అంతర్యుద్ధానికి దారి తీస్తుందని ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందిన క్రమంలో ప్రిగోజిన్ వెనక్కి తగ్గారు. అయితే ఈమధ్యే జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మృతిచెందిన విషయం తెలిసిందే.


ఏది ఏమైనప్పటికీ రష్యాలో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడు వ్లాదిమిర్ పుతినే అంటూ అభిప్రాయ సేకరణలు చెబుతున్నాయి. లెవాడా-సెంటర్ ప్రకారం ఆగస్టులో జరిగిన అభిప్రాయ సేకరణ సర్వేలో 80 శాతం మందికి పైగా రష్యన్లు పుతిన్ కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడైంది. ఉక్రెయిన్ పై యుద్ధానికి ముందు కంటే కూడా ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఉక్రెయిన్ పై దండయాత్రకు 70 శాతం మంది రష్యన్లు మద్దతు ఇస్తున్నట్లు తేలింది. అయితే ప్రతిపక్ష రాజకీయ నాయకులు, కొంత మంది పాశ్చాత్య దౌత్తవేత్తలు మాత్రం ఇలాంటి పోల్స్ నను విశ్వసించలేమని చెబుతున్నారు. 


ఇటీవలె మరణించిన ప్రిగోజిన్


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై కొన్ని నెలల కిందట తిరుగుబాటు చేసిన ప్రైవేట్‌ సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ మృతి చెందాడు. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్‌ చనిపోయారని రియా నోవోస్టి వెల్లడించారు. వాగ్నర్ అధినేత ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా కుప్పకూలిన ప్రమాదంలో ప్రిగోజిన్‌ తో పాటు 10 మంది వరకు మృతిచెందినట్లు రష్యా అత్యవసర సేవల విభాగం తెలిపింది. విమానం కూలిపోయిన ప్రదేశంలో పది మృతదేహాలను కనుగొన్నట్లు రష్యా ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. 


ట్వెర్ ప్రాంతంలో ఓ విమానం కూలిపోయింది. అందులో ప్రైవేట్ సైన్యం వాగ్నర్ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ ప్రయాణిస్తున్నారు. కానీ విమాన ప్రమాదంతో పెను విషాదం చోటుచేసుకుందని TASS వార్తా సంస్థతో పాటు RIA నోవోస్టి, ఇంటర్‌ఫాక్స్ రిపోర్ట్ చేశాయి. ఆ విమానంలో మొత్తం 10 మంది ప్రయాణిస్తుండగా, అందులో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. దురదృష్టవశాత్తూ అందులో ప్రయాణిస్తున్న అంతా చనిపోయారని రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇటీవల రష్యా అధినేతకు ఎదురుతిరిగిన ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో చనిపోవడంతో అనుకోకుండా జరిగిందా, లేదా ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అని ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.