ఉత్తరాఫ్రికా దేశమైన మొరాకోలో తీవ్ర భూకంపం కారణంగా పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం ధాటికి దేశం అతలాకుతలమైంది. భూకంప కేంద్ర ప్రాంతమైన అట్లస్‌ పర్వత గ్రామాల్లో పరిస్థితులు మరీ దారుణంగా మారాయి. గ్రామాలు దాదాపుగా నేలమట్టమయ్యాయి. అట్లస్‌ పర్వతాలకు కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న మారుమూల చిన్న గ్రామం తిఖ్త్‌లో పూర్తిగా ఇళ్లన్నీ కూలిపోయాయి. గ్రామానికి గ్రామమే లేకుండా పోయింది. ప్రజలంతా సర్వస్వం పొగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలారు. భూకంపంలో మృతుల సంఖ్య ఇప్పటికే 2100 దాటేసింది.  వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.


ప్రముఖ పర్యాటక, చారిత్రక ప్రదేశమైన మారకేష్‌ నగరానికి దక్షిణంలో సుమారు 70 కిలోమీటర్ల దూరంలో అట్లాస్‌ పర్వత ప్రాంతాన్ని భూకంప కేంద్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.8గా నమోదైంది. శుక్రవారం రాత్రి 11  గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు చుట్టు ఉన్న సుమారు ఐదు ప్రావిన్సుల ప్రజలను భయాందోళలకు గురిచేసింది. అట్లాస్‌ పర్వతాల్లోని మారుమూల గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు.గత ఆరు దశాబ్దాల్లో మొరాకోలో సంభవించిన అతి పెద్ద భూకంపం ఇదే.


మారుమూల కుగ్రామమైన తిఖ్త్‌లో దాదాపు వంద కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు మొత్తం కూలిపోయిన ఇళ్లు, మట్టి దిబ్బలు, శవాలు , క్షతగాత్రులతో నిండిపోయి పరిస్థితి భయానకంగా మారింది. జీవితం అంతా అయిపోయింది, గ్రామం నాశనమైపోయింది అంటూ ఓ వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలోని ఇళ్లంతా మట్టి, రాయి, కలప, మోర్టార్‌లతో కలిపి సంప్రదాయ పద్ధతిలో కట్టిన పాత ఇళ్లు. భూకంప తీవ్రతకు ఒక్కటి కూడా మిగల్లేదు. అన్నీ నేలమట్టమయ్యాయి. నిలువ నీడ లేని గ్రామస్థుల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. గ్రామస్థులు చనిపోయిన వారికి అంత్యక్రియల నిర్వహిస్తండగా, సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. తమ ప్రాంతంలో గతంలో భూకంపం రావడం ఎప్పుడూ చూడలేదని తిఖ్త్‌ గ్రామస్థుడు ఒకరు వెల్లడించారు. ఇక్కడ వాళ్లు ఇళ్లు కట్టినప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించి ఉండరని ఈ విపత్తు కారణంగా తన కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులను కోల్పోయిన 23ఏళ్ల విద్యార్థి పేర్కొన్నారు.


భూకంప ప్రభావానికి ఎక్కువగా మారుమూల గ్రామాలు లోనయ్యాయి. దీంతో రహదారి సౌకర్యాలు సరిగ్గా లేక సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కొన్ని చోట్ల రహదారులు కూడా ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ లేకపోవడం కూడా సమస్యగా మారింది. అంబులెన్సులు వెళ్లడానికి కూడా వీల్లేకుండా ఉంది. దీంతో సహాయకచర్యలు కష్టంగా మారాయి. 


మొరాకో భూకంప బాధితులకు సహాయం చేసేందుకు ఎన్నో దేశాలు ఇప్పటికే ముందుకు వచ్చాయి. విదేశీ బృందాలు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. యూకే, ఫ్రాన్స్‌, అమెరికా, ఖతర్‌, యూఏఈ వంటి దేశాలు మొరాకోకు సాయం అందించేందుకు అంగీకరించారు. పక్కనే ఉన్న స్పెయిన్‌ దేశం నుంచి రెండు బృందాల్లో సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. యూకే నుంచి సైనిక రవాణా హెలికాప్టర్లు, వైద్య బృందాలు, సహాయక సిబ్బంది మొరాకో వెళ్లారు. సాయం చేస్తున్న దేశాలకు మొరాకో రాజు మహమ్మద్‌-6 ధన్యవాదాలు తెలిపారు.