Digvijaya Singh: కర్ణాటకలో ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం ఇవ్వడం పెద్ద వివాదానికి దారి తీయడం తెలిసిందే. ఈ కాంగ్రెస్ హామీపై బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. ఎలాగోలా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినప్పటికీ.. బజరంగ్ దళ్ అంశం పెద్ద వివాదానికి మాత్రం కేంద్ర బిందువైంది. అయితే రాబోయే రోజుల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ ను నిషేధించే విషయంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత భజరంగ్ దళ్ ను నిషేధించబోమని స్పష్టం చేశారు దిగ్విజయ్ సింగ్. అయితే అల్లర్లను, హింసను ప్రేరేపించే వారిని మాత్రం విడిచిపెట్టబోమన్నారు.


'మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలిస్తే బజరంగ్ దళ్ ను నిషేధించబోం. ఎందుకంటే బజరంగ్ దళ్ లో కూడా కొంత మంది మంచి వ్యక్తులు ఉండొచ్చు. కానీ అల్లర్లకు, హింసకు కారణమయ్యే వారిని మాత్రం విడిచిపెట్టబోం' అని దిగ్విజయ్ సింగ్ చెప్పుకొచ్చారు. 


కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎన్నికల కమిటీలో భాగమైన దిగ్విజయ్ సింగ్ తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రామ మందిరం ఉద్యమం సమయంలో ఏర్పాటైన బజరంగ్ దళ్ అనేది విశ్వహిందూ పరిషత్ కు యువజన విభాగం. కర్ణాటక ఎన్నికల వేళ వివాదంగా మారిన బజరంగ్ దళ్ నిషేధం వ్యాఖ్యలు ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఓటు వేసేటప్పుడు జై భజరంగబలి అని చెప్పాలని ప్రజలను ప్రధాని మోదీ కోరిన విషయం తెలిసిందే. బజరంగ్ దళ్ పై నిషేధం విధించాలన్న కాంగ్రెస్ ప్రతిపాదన హనుమంతుడిని అవమానించడమేనని బీజేపీ పేర్కొంది. రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మిజోరాంతో పాటు మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.


Also Read: Deepika Kothari: అతడుగా మారుతున్న ఆమె, మధ్యప్రదేశ్ కానిస్టేబుల్ ఆపరేషన్‌కు అనుమతి 


బజరంగ్ దళ్ ఒక హిందూ ధార్మిక సంస్థ. విశ్వ హిందూ పరిషత్ (VHP)కి ఇది యువ విభాగంగా వ్యవహరిస్తారు. 1984, అక్టోబర్ 1 న ఉత్తర ప్రదేశ్ లో బజరంగ్ దళ్ ను స్థాపించగా, అనంతరం దేశమంతటా విస్తరించింది. గోవధను నిషేధించడం దీని ముఖ్య ఉద్దేశాలలో ఒకటి. ఇంకా హిందూ ధర్మం నుంచి ఇతర మతాలలోకి జరిగే మతమార్పులను అరికట్టడం కూడా వీరి లక్ష్యాలలో ఒక భాగం.