Digital e-Passport : విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి. ఇప్పుడు సాంప్రదాయ పాస్‌పోర్టును నవీకరించి, ఈ-పాస్‌పోర్టును మన విదేశాంగ శాఖ ప్రారంభించింది. భారతీయ పౌరులందరూ ఈ మోడ్రన్ ట్రావెల్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ-పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి...
ఈ-పాస్‌పోర్టును తొలిసారిగా భారత విదేశాంగ శాఖ ఏప్రిల్ 1, 2024న ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. దేశంలో కొన్ని ఎంపిక చేసిన పాస్‌పోర్ట్ కేంద్రాల నుండి మాత్రమే ఈ-పాస్‌పోర్టును జారీ చేసే అవకాశం ఇచ్చారు. అయితే, ఇక ముందు ఈ సేవలను దేశంలోని మరి కొన్ని పాస్‌పోర్ట్ కేంద్రాలకు విస్తరించాలని విదేశాంగ శాఖ నిర్ణయించింది.
ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏమిటి?
ఈ-పాస్‌పోర్ట్ అనేది ఇప్పటి వరకు మీరు వాడుతున్న పాస్‌పోర్టుకు మోడ్రన్ రూపమే. ఈ పాస్‌పోర్టులో ఫిజికల్ మరియు డిజిటల్ లక్షణాలు ఉంటాయి. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ ఉంటుంది. దాంతో పాటు అంటెన్నా కూడా కలిగి ఉంటుంది. ఇవి మన వ్యక్తిగత సమాచారం, వేలి ముద్రలు, డిజిటల్ ఫోటోగ్రాఫ్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను ఇందులో భద్రంగా నిక్షిప్తం చేస్తాయి. పాస్‌పోర్టు బయట వైపు కవర్‌పై బంగారు చిహ్నం ఏర్పాటు చేస్తారు. పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ నంబర్ వంటి వివరాలు ఇందులో రికార్డయి ఉంటాయి. భద్రతను మరింత పెంచేందుకు ఎన్‌క్రిప్టెడ్ యాక్సెస్‌తో కూడిన కాంటాక్ట్‌లెస్ చిప్ అమర్చుతారు. ఇది ICAO (International Civil Aviation Organization) మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది. ఈ పాస్‌పోర్టు వల్ల నకిలీ పాస్‌పోర్టులు తయారు చేసే అవకాశం చాలా వరకు నిరోధిస్తుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ-పాస్‌పోర్టు అనేది ప్రయాణికుల భద్రత, వేగంగా ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసేందుకు అధునాతన సాంకేతికతతో తయారైన ట్రావెల్ డాక్యుమెంట్. అయితే, ఈ-పాస్‌పోర్ట్, మామూలుగా మనం వాడే పాస్‌పోర్టుకు ప్రత్యామ్నాయం కాదని విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. పాస్‌పోర్ట్ భద్రతను పెంచడం, పారదర్శకతను పెంచడం, అంతర్జాతీయ ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా సులువుగా ప్రయాణం చేసేందుకు ఈ-పాస్‌పోర్టు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే...?
- ఈ-పాస్‌పోర్ట్ కావాలనుకునేవారు అధికారిక పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లోకి వెళ్లాలి.
- పోర్టల్‌లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడానికి రిజిస్టర్ చేసుకోవాలి.
- లాగిన్ అయిన తర్వాత ఈ-పాస్‌పోర్టుకు సంబంధించిన అప్లికేషన్ ఫారంను నింపాలి.
- ఈ-పాస్‌పోర్టు కోసం ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుం చెల్లించాలి.
- ఆ తర్వాత మీ సమీపంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (PSK) లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (POPSK) ను ఎంచుకోండి.
- మీరు ఎంచుకున్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో మీకు సౌలభ్యమైన సమయాన్ని అపాయింట్‌మెంట్ షెడ్యూల్ గా ఎంచుకోండి.
- మీకు కేటాయించిన అపాయింట్‌మెంట్ రోజున, మీరు ఎంచుకున్న PSK లేదా POPSK కు వెళ్లాల్సి ఉంటుంది.
- అక్కడ మీ బయోమెట్రిక్ వివరాలు నమోదు చేస్తారు. దాంతో పాటు మీరు సమర్పించే డాక్యుమెంట్స్‌ను పరిశీలిస్తారు.
- ఆ తర్వాత ఈ-పాస్‌పోర్ట్ జారీ అవుతుంది.