Devendra Fadnavis Take Oath As New CM Of Maharastra: మహారాష్ట్రలో గురువారం సాయంత్రం 'మహాయుతి' (Mahayuti) ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) సీఎంగా, శివసేన అధినేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde), ఎన్సీపీ అగ్రనాయకుడు అజిత్ పవార్‌లు (Ajit Pawar) ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదానంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఫడణవీస్ సీఎంగా ప్రమాణం చేయడం ఇది మూడోసారి.
కాగా, ఫడణవీస్ 1989లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించి 22 ఏళ్ల వయసులోనే నాగ్‌పూర్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1997లో మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1999 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన ఆయన.. 2014లో మొదటిసారి సీఎంగా ఎన్నికయ్యారు. 2019 నవంబర్ 23న రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. అయితే, సరిపడా బలం లేకపోవడంతో 3 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడూ మూడోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
చివరి వరకూ ప్రతిష్టంభన
ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముంబయిలో బుధవారం బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడణవీస్ పేరు ఖరారు చేయడంతో ప్రతిష్టంభనకు తెరపడింది. మిత్ర ధర్మాన్ని పాటిస్తూ బీజేపీ అధిష్టానం శిందే, అజిత్ పవార్‌లకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించింది. కాగా, అజిత్ పవార్ బాధ్యతలపై బుధవారమే ఓ స్పష్టత రాగా.. శిందే బాధ్యతలు స్వీకరిస్తారా.? లేదా.? అనే దానిపై టెన్షన్ నెలకొంది. అయితే, శివసేన అధికారిక ప్రకటన చేయడంతో ప్రతిష్టంభన వీడింది.
నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 'మహాయుతి' కూటమి.. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 233 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 51 చోట్ల గెలుపొందింది. బీజేపీ 132 స్థానాలు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. శివసేన (ఏక్‌నాథ్ శిందే) వర్గం 57, ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గం 41 స్థానాల్లో గెలుపొందాయి. ఇక శివసేన (ఉద్ధవ్) పార్టీ 20 చోట్ల విజయం సాధించగా.. కాంగ్రెస్ 16, ఎన్సీపీ (ఎస్పీ) 10 స్థానాలు గెలుచుకున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ 2, జన్ సురాజ్య శక్తి 2, రాష్ట్రీయ యువత స్వాభిమాన్ పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష, ఏఐఎంఐఎం, సీపీఎం, పీడబ్ల్యూపీఐ, ఆర్‌వీఏ చెరో ఒక స్థానం చొప్పున గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు 2 స్థానాల్లో విజయం సాధించారు.
Also Read: Uber: టైమ్‌కు రాలేదని ఉబెర్‌ను కోర్టుకు లాగిన కస్టమర్ - అంతేనా రూ.54వేల పరిహారం కూడా పొందాడు !