Devendra Fadnavis: మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భావోద్వేగానికి గురవుతూ ఓ ట్వీట్ చేశారు. జలగావ్ ప్రాంతంలో ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల కోసం దీప స్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. దివ్యాంగురాలైన ఓ అమ్మాయి డిప్యూటీ సీఎం నుదిటిపై తన కాలితో తిలకం దిద్దారు. కాలితోనే హారతి కూడా ఇచ్చారు. దీనిపై దేవేంద్ర ఫడ్నవీస్ చాలా భావోద్వేగానికి గురయ్యారు. కార్యక్రమం అనంతరం ఓ ట్వీట్ పెట్టారు. 


'ఇన్నేళ్లలో ఎందరో మాతృమూర్తులు, సోదరీమణుల నుంచి నేను ఆశీర్వాదం తీసుకున్నాను. వారు నా నుదిటి తిలకం కూడా దిద్దారు. ఇప్పుడు ఓ సోదరి కూడా నా నుదిటిపై తిలకం దిద్దారు. కానీ ఆమె చేతితో కాకుండా.. తన కాలి బొటనవేలితో తిలకం దిద్దారు. ఇది నన్నెంతో భావోద్వేగానికి గురి చేసింది. జీవితంలో ఇటువంటి క్షణాలు ఎప్పటికీ గుర్తిండి పోతాయి. ఆ సోదరి కాలితో నాకు తిలకం దిద్దడమే కాదు.. హారతి కూడా ఇచ్చింది. నాకు ఆ సోదరి తిలకం దిద్దుతున్న సమయంలో ఆమె ముఖంలో చిరువ్వు చూశా. ధైర్యాన్ని చూశా. ఆమె కళ్లలో ఓ మెరుపు చూశా. ఆమెలో నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. ఎవరి దయ నాకు అక్కర్లేదు. నేను బలంగా ఉన్నాను.. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ముందుకు వెళ్లగలను అనే ధీమా కనిపించింది. ఆమె ప్రతి పోరాటంలో నేను అండగా ఉంటాను' అని దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ లో రాసుకొచ్చారు. 



మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ జూన్ 27వ తేదీని ఈ పోస్టు చేయగా.. ఇప్పటి వరకు 1.1 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే వందలకొద్దీ కామెంట్లు వచ్చాయి. దేవేంద్ర ఫడ్నవీస్ దయా హృదయానికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఇలాంటి గొప్ప నాయకుడిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని, అభిమానాన్ని కనబరుస్తారని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. ఇలాంటి పనులతో మీరెంత ఒదిగి ఉంటారనేది మరోసారి నిరూపితం అయిందని మరో యూజర్ కామెంట్ చేశారు.