Kerala Medicos:
ఏడుగురు ముస్లిం విద్యార్థినుల లేఖ..
కేరళలోని తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏడుగురు ముస్లిం విద్యార్థినులు ఆపరేషన్ థియేటర్‌లోకి హిజాబ్‌కి బదులుగా వేరే లాంగ్ స్లీవ్ జాకెట్‌లు వేసుకునేందుకు అనుమతినివ్వాలని ప్రిన్సిపల్‌ని కోరారు. ప్రతి చోటా తమకు హిజాబ్ ధరించడం వీలుకాకపోవచ్చని, అందుకు బదులుగా అలాంటి డ్రెస్‌నే వేసుకునేందుకు అనుమతించాలని ప్రిన్సిపల్‌కి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రిన్సిపల్...ఆపరేషన్ థియేటర్‌లో డ్రెస్ కోడ్‌ని మార్చడం వీలుకాదని తేల్చి చెప్పారు. టెక్నికల్‌గా సమస్యలు ఎదురయ్యే అవకాశముందని అన్నారు. అయినా...వాళ్ల రిక్వెస్ట్ మేరకు సర్జన్లతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ టీమ్‌తోనూ మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఆ తరవాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఆ ఏడుగురు ముస్లిం విద్యార్థినులు కాలేజ్‌లో తాము హిజాబ్ ధరించడానికి ఇబ్బందిగా ఉంటోందని లేఖ రాశారు. "డ్రెస్ కోడ్ విషయంలో మెడికల్ కాలేజ్ రూల్స్ ప్రకారం నడుచుకుంటూనే మా మతాచారాలు పాటించడం చాలా కష్టంగా ఉంటోంది. రెండింటినీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం" అని అందులో ప్రస్తావించారు. అయితే...ఆపరేషన్ థియేటర్లలోని డ్రెస్‌కోడ్‌ని అంతర్జాతీయంగా ఒకే విధంగా పాటిస్తారు. అందుకే అది మార్చడం అంత సులభం కాదు. మతాచారాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే మార్చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు ప్రిన్సిపల్. పదిరోజుల్లో పరిష్కారం చూపించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
కోర్టుకెక్కిన స్కూల్ స్టూడెంట్..
అంతకు ముందు కేరళలోనే ఓ స్కూల్ విద్యార్థిని హిజాబ్ విషయమై కోర్టుకెక్కింది. స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రాజెక్ట్‌లో తాను పాల్గొంటున్నానని, హిజాబ్ ధరించేలా అనుమతినివ్వాలని కోరింది. ఫుల్ స్లీవ్ యునిఫామ్‌లు వేసుకోడానికి పర్మిషన్ అడిగింది. హైకోర్టు వరకూ వెళ్లినప్పటికీ..కోర్టు మాత్రం ఆ విద్యార్థిని పిటిషన్‌ని కొట్టేసింది.
హైదరాబాద్‌లోనూ..
ఇటీవల హైదరాబాద్‌లోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు వచ్చిన ముస్లిం విద్యార్థినులను కాలేజ్ సిబ్బంది లోపలికి వెళ్లనివ్వబోమని చెప్పడం వివాదానికి దారితీసింది. పలువురు ముస్లిం విద్యార్థినులు డిగ్రీ ఉర్దూ మీడియం సప్లిమెంటరీ పరీక్షకు హిజాబ్ ధరించి వచ్చారు. అయితే. పరీక్షా కేంద్రంలోకి వారిని కాలేజీ సిబ్బంది అనుమతించడానికి నిరాకరించింది. హిజాబ్‌తో రావద్దని సూచించారు. అలా చెప్పడంతో విద్యార్థినులకు, కాలేజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం తలెత్తింది. వారితో గొడవెందుకనుకున్న కొంతమంది విద్యార్థినులు హిజాబ్ తీసేసి పరీక్షలు రాశారు. మరికొంతపెద్దలకు చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి కాలేజీ యాజమాన్యం హిజాబ్‌తోనే విద్యార్థినులను పరీక్షకు అనుమతించారు. అరగంటపాటు తమను ఆపేశారని గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదని విద్యార్థినులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: నేను సిద్దరామయ్యలా భయపడే రకాన్ని కాదు, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు - డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు